- బీఆర్ఎస్ లో అవమానాలు భరించలేకనేనని వెల్లడి
గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జడ్పీ చైర్ పర్సన్ సరిత గురువారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీలో అవమానాలు భరించలేక ఆ పార్టీకి గుడ్ బై చెప్పానని ఆమె తెలిపారు. నడిగడ్డ ఇలవేల్పు జమ్మలమ్మ, ఐదో శక్తిపీఠం జోగులాంబ అమ్మవారు కొలువుదీరిన నడిగడ్డలో మహిళలకు బీఆర్ఎస్ పార్టీలో గౌరవం లేదన్నారు. పార్టీలో ఉన్న వారు పెట్టే టార్చర్ భరించలేక పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరామన్నారు.
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేస్తామని తెలిపారు. ఏఎంసీ మాజీ చైర్మన్ బండ్ల లక్ష్మీదేవి చంద్రశేఖర్ రెడ్డి, గట్టు సర్పంచ్ ధనలక్ష్మి కృష్ణమూర్తి, ధరూర్ మండల సీనియర్ నాయకుడు గాజులపాడు రాఘవేందర్ రెడ్డి తదితరులు ఆమె వెంట కాంగ్రెస్లో చేరారు.