గగన్‌యాన్‌.. టీవీ-డీ1 పరీక్ష విజయవంతం

ఇస్రో చ‌రిత్ర సృష్టించింది. మ‌నుషుల‌ను నింగిలోకి పంపే ప్రయోగంలో స‌క్సెస్ సాధించింది. గ‌గ‌న్‌యాన్ మిష‌న్‌లో భాగంగా శనివారం (అక్టోబర్​ 21న)  నిర్వహించిన టీవీ-డీ1 ఫ్ల‌యిట్ టెస్ట్ విజ‌య‌వంత‌మైంది. ముందుగా రెండు సార్లు రాకెట్ ప్రయోగాన్ని వాయిదా వేసినా.. ఆ త‌ర్వాత ఉద‌యం 10 గంట‌ల‌కు ప్రయోగాన్ని విజ‌య‌వంతంగా నిర్వహించారు.

టీవీ-డీ1 క్రూ మాడ్యూల్ అనుకున్నట్లే నింగిలోకి దూసుకెళ్లి.. ఆ త‌ర్వాత బంగాళాఖాతంలో సుర‌క్షితంగా దిగింది. పారాచూట్ల ఆధారంగా మాడ్యూల్ నీటిపై వాలింది. మూడు పారాచూట్ల సాయంతో క్రూ మాడ్యూల్ దిగింది. సముద్రంలో ఉన్న ఇండియ‌న్ నేవీ ఆ మాడ్యూల్‌ను సేక‌రించ‌నుంది. 

రోదసిలోకి సొంతంగా వ్యోమగాములను పంపేందుకు భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న గగన్‌యాన్‌ సాకారం దిశగా తొలి అడుగు పడింది. ఈ ప్రాజెక్టులో భాగంగా తలపెట్టిన కీలక ‘టెస్ట్‌ వెహికిల్‌ అబార్ట్‌ మిషన్‌ (టీవీ-డీ1)’ వాహకనౌక పరీక్షను ఇస్రో శనివారం (అక్టోబర్​ 21న)  విజయవంతంగా పరీక్షించింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి ఉదయం 10 గంటలకు సింగిల్‌ స్టేజ్‌ లిక్విడ్‌ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత రాకెట్‌ నుంచి విడిపోయిన క్రూ మాడ్యూల్‌.. సురక్షితంగా పారాచూట్ల సాయంతో సముద్రంలోకి దిగింది.

రాకెట్‌ నింగిలోకి బయలుదేరాక అనూహ్య పరిస్థితుల్లో ప్రయోగాన్ని రద్దు చేసుకోవాల్సిన పరిస్థితిని ఇస్రో శాస్త్రవేత్తలు అనుకరించారు. ఇందుకోసం ‘అబార్ట్‌’ సంకేతాన్ని పంపారు. దీంతో రాకెట్ పైభాగంలో  క్రూ ఎస్కేప్‌ వ్యవస్థకు సంబంధించిన ఘన ఇంధన మోటార్లు ప్రజ్వరిల్లాయి. దాదాపు 12 కిలోమీటర్ల ఎత్తులో.. క్రూ ఎస్కేప్‌ వ్యవస్థను రాకెట్‌ నుంచి వేరు చేశాయి.

17 కిలోమీటర్ల ఎత్తులో క్రూ ఎస్కేప్‌ మాడ్యూల్‌, క్రూ మాడ్యూల్‌ పరస్పరం విడిపోయాయి. ఆ తర్వాత డ్రోగ్‌ పారాచూట్లు విచ్చుకున్నాయి. సెకనుకు 8.5 మీటర్ల వేగంతో క్రూ మాడ్యూల్‌.. సురక్షితంగా బంగాళాఖాతంలో దిగింది.