
- నిఫ్టీ 31 పాయింట్లు అప్
న్యూఢిల్లీ : గ్లోబల్ మార్కెట్ల నుంచి పాజిటివ్ సిగ్నల్స్రావడం, టెలికాం, టెక్, కన్స్యూమర్ డ్యూరబుల్ షేర్లు లాభపడటంతో సూచీలు మంగళవారం వరుసగా మూడో సెషన్‌లో లాభాలతో ముగిశాయి. ఇంట్రాడేలో 400 పాయింట్లకు పైగా ర్యాలీ చేసిన తరువాత, సెన్సెక్స్ 89.83 పాయింట్లు లాభంతో 73,738.45 వద్ద ముగిసింది. నిఫ్టీ 31.60 పాయింట్లు పెరిగి 22,368 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఇది 111.15 పాయింట్లు పెరిగి 22,447.55 వద్దకు చేరుకుంది.
ప్రాఫిట్ బుకింగ్ కారణంగా రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో భారీ అమ్మకాల ఒత్తిడి, మార్కెట్ సూచీలను కిందకు లాగింది. రిలయన్స్ ఒక శాతంపైగా నష్టపోయి రూ.2,918.50 వద్ద ముగిసింది. సెన్సెక్స్ నుంచి భారతీ ఎయిర్‌టెల్, నెస్లే, మారుతీ, టాటా మోటార్స్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎన్‌టీపీసీ, ఏషియన్ పెయింట్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు లాభపడ్డాయి.
అయితే, సన్ ఫార్మా, రిలయన్స్ ఇండస్ట్రీస్, మహీంద్రా అండ్ మహీంద్రా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టెక్ మహీంద్రా బజాజ్ ఫైనాన్స్ వెనుకబడి ఉన్నాయి. ఆసియా మార్కెట్లలో, టోక్యో, హాంకాంగ్ లాభాల్లో, సియోల్, షాంఘై నష్టాల్లో ముగిశాయి. యూరోపియన్ మార్కెట్లు లాభాలతో ట్రేడవుతున్నాయి. సోమవారం వాల్ స్ట్రీట్ లాభాలతో ముగిసింది.