అక్టోబర్ 2న మంథనిలో పరమపదించిన ప్రముఖ సాహితీవేత్త, కవి, బహు గ్రంథ కర్త , వయోవృద్ధులు గజానన్ తామన్ తన రచనల్లో తెలంగాణ సంస్కృతిని ఆవిష్కరించారు. తెలంగాణ గురించి చక్కని గేయాలు, పద్యాలు రాశారు. తెలంగాణ ఉద్యమం పట్ల ఆయన రాసిన గేయాలు, పాటలు డాక్టర్ సి. నారాయణరెడ్డి లాంటి ప్రముఖులతో పాటు పలువురు కవులు, మేధావులు ఎంతో ప్రశంసించారు. అనేక భాషల్లో పండితుడాయన. ఉర్దూలో కూడా కొన్ని కవితలు రాశారు. ఉపనిషత్తుల నుంచి ఆంగ్లభాషలోని ఆధునిక వ్యాకరణ విశేషాల దాకా లోతైన పాండిత్యం గలవారు. ఒక ఋషితుల్యుడైన సాహితీవేత్త. 5 డిసెంబర్ 1936 రోజున గజానన్ తామన్ ఆసిఫాబాద్ కు చెందిన చాకేపల్లి మక్తేదారుల కుటుంబంలో రాధాబాయి – గుణవంతరావులకు ప్రథమ పుత్రుడిగా జన్మించారు.
బహుభాషా కోవిదుడు
ఆయన తెలుగు, మరాఠీ, హిందీ, ఆంగ్లము, గుజరాతీ, పంజాబీ, సంస్కృతం, ఉర్దూ భాషలలో నిపుణుడు. బహు భాషావేత్త. ఆయన బంధువైన వెంకట రాజన్న అవధాని, వానామమలై వరదాచర్యులు వంటి వారి ప్రేరణ పొందారాయన. ఆయన ప్రచురించిన కఠోపనిషత్ తెలుగు పద్యానువాదం పలువురి ప్రశంసలు పొందింది. ఆయన రచనలు మానస సరోవరం, సాకేత రామాయణం తెలుగు సాహితీ ప్రపంచంలో బహుళ ప్రచారంలో ఉన్నవి. మరాఠీ కవి దిగంబర్ మడ్గూల్కర్ రాసిన గీత్ రామాయణ్ కు అనుసృజనగా సాకేత రామాయణం రాశాడు తామన్. ఈ రామాయణం అంతా గేయ రూపంలో ఉంటుంది. మానస సరోవరం కావ్యంలో ఆయన పుట్టిన ఆదిలాబాద్ గురించి రాస్తూ ‘ప్రకృతి పెదాలపైని మృదుహాస రేఖలా మైళ్ళుగా వ్యాపించిన మహారణ్యం’ అంటూ వర్ణిస్తారు. ఈ పుస్తకం లో వివిధ అంశాలపైనా 52 కవితలు, 26 గేయాలు ఉన్నాయి. ఆయన కవితలు ఆకాశవాణిలో కూడా ప్రసారమయ్యాయి. తామన్ తెలుగువాడైనప్పటికీ మహారాష్ట్రలో తాను చదివిన నాందేడ్‌లోని పీపుల్ కళాశాలలో పీజీ విద్యార్థులకు ఆంగ్లం బోధించేవారు. ప్రిన్సిపాల్‌గా 1996లో పదవీ విరమణ చేసిన తర్వాత కుటుంబంతో సహా మంథనిలో నివాసం ఉన్నారు.
సమాజం పట్ల గొప్ప అవగాహన
ఆయనకు దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, ఒకప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి చౌహాన్ తో సాన్నిహిత్యముండేది. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మహా మేధావిగా ఆయనను అందరూ పరిగణిస్తారు. సాహిత్యంతో పాటు పరిపాలన, పథకాలు, ప్రాజెక్టులు, రాజకీయాలు ఇలా ఎన్నో విషయాలపై లోతైన అవగాహనతో మాట్లాడుతుండేవారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్రలో ఎంతోమంది సాహితీ ప్రముఖులతో పరిచయాలున్నాయి. విశాఖపట్నం విజయవాడ తదితర నగరాల్లోనూ సన్మానాలు పొందారు. పీఠాపురంలో డా.సోమసుందర్ నుంచి సన్మానాన్ని పొందారు. పద్మశ్రీ శ్రీభాష్యం విజయసారథి చేతుల మీదుగా సన్మానం పొందారు. ఉత్తమ సాహితీవేత్తగా తెలంగాణ ప్రభుత్వం నుంచి పురస్కారం పొందారు. తెలంగాణ అంటే అమితమైన ప్రేమ, ఎంతో ఇష్టం. తెలంగాణ రాష్ట్ర గీతం కోసం తెలుగు, ఉర్దూ భాషల్లో గేయాలు రచించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ఎవరు కలిసినా కొత్తగా వస్తున్న సాహిత్యం, బాగా రాస్తున్న కవుల గురించి చెప్పేవారు. ఆ వయసులో సామాజిక మాధ్యమాలలో కూడా అప్‌డేట్‌గా ఉండటం ఆశ్చర్యం కలిగించేది. 87ఏండ్ల వయసులో గజానన్ తామన్ 2 అక్టోబర్ 2023 సోమవారం రోజున అసువులు బాశారు. గజానన్ తామన్ సాహిత్యాన్నంతా వెలుగులోకి తెచ్చేందుకు, మంథనిలో వారి విగ్రహం ఏర్పాటుకు స్థానికులు, పాలకులు ముందుకు వస్తే ఆయనకు సరియైన నివాళి అవుతుంది.