నీటి రంగంలో స్టార్టప్‌‌‌‌‌‌‌‌లకు ఎన్నో అవకాశాలు.. కేంద్రమంత్రి షెకావత్​

హైదరాబాద్​, వెలుగు: సాగునీటి రంగంలో స్టార్టప్​లకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు.  టీ–హబ్​లో జరిగిన జిటో ఇంక్యుబేషన్ అండ్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (జెఐఐఎఫ్) సమావేశంలో ఆయన ప్రసంగించారు. పారిశ్రామిక రంగాల కంటే వ్యవసాయ రంగం ఎక్కువ నీటిని ఉపయోగిస్తోందని వెల్లడించారు. దేశంలో మంచి నీటి వాడకం 771,000 బిలియన్ లీటర్ల వరకు ఉందని, వ్యవసాయ రంగంలో తలసరి నీటి వినియోగం సంవత్సరానికి 4,913 నుంచి 5,800 కిలోలీటర్ల వరకు ఉంటుందని వివరించారు. 

ALSO READ:పట్టాల పొంటి నడిచారని గుంజీలు తీయించారు

ఇది ఇతర దేశాలతో పోలిస్తే చాలా ఎక్కువని ఆయన అన్నారు. ‘‘వ్యవసాయంలో  నీటిని పొదుపు చేయడానికి  పెద్దగా ప్రయత్నాలు జరగడం లేదు. పరిశ్రమ,  వినియోగ రంగాలలో నీటి సంరక్షణ బాగుంది. వ్యవసాయ రంగంలో నీటి సంరక్షణ కోసం మాకు ప్రైవేట్ రంగ సహాయం కావాలి. ఇక్కడే మనకు స్టార్టప్‌‌‌‌‌‌‌‌లు అవసరం.  నీటిని ఆదా చేయడానికి స్టార్టప్​లు ప్రభుత్వంతో కలసి పనిచేయాలి.  పంట దిగుబడిని మెరుగుపరచడం,  నిర్వహణకు సహాయం చేయడం, కొత్త టెక్నాలజీలను వాడటం, ఉత్పత్తిని పెంచడం, శ్రమ సమయాన్ని తగ్గించడం వంటి విషయాల్లో స్టార్టప్​ల సేవలను వాడుకోవచ్చు”అని ఆయన అన్నారు.