చందానగర్, వెలుగు : యువతకు ఉపాధి కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని శేరిలింగంపల్లి బీజేపీ ఇన్ చార్జ్గజ్జల యోగానంద్విమర్శించారు. పేపర్ లీకేజీ లు చేసి యువత భవిష్యత్ తో ప్రభుత్వం చెలగాటమాడుతుందని మండిపడ్డారు. నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు గజ్జల యోగానంద్ ఫౌండేషన్ ఫౌండర్ ట్రస్టీ, వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ సహకారంతో మియాపూర్మదీనాగూడలోని జెనిసిస్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఆదివారం జాబ్మేళా నిర్వహించారు.
50 కి పైగా ఐటీ కంపెనీలతో పాటు ఇతర సంస్థలు పాల్గొనగా, 3 వేల మందికి పైగా యువత హాజరయ్యారు. ఇందులో 800 మందికి పైగా ఎంపిక కాగా, మరో వెయ్యి మంది దరఖాస్తులు పరిశీలనలో ఉన్నటు ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా గజ్జల యోగానంద్ మాట్లాడుతూ తమ స్వచ్ఛంద సంస్థ ద్వారా కరోనా సమయంలో 60 వేలకుపైగా కుటుంబాలకు నిత్యావసరాలు, మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశామని గుర్తుచేశారు. వివిధ సంస్థల సహకారంతో మహిళలు, యువత సాధికారతకు పలు అవగాహన సదస్సులను ఏర్పాటు చేశామని తెలిపారు.
అనంతరం ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు గజ్జల యోగానంద్ ఆఫర్ లెటర్స్ అందించారు. ఇక ముందు కూడా ప్రజలకు తమ ఫౌండేషన్ అందుబాటులో ఉంటుందని, పలు సేవా కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి, పరిష్కరించడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తుందని గజ్జల యోగానంద్ తెలిపారు.