ఆంధ్రా కాంట్రాక్టర్లకు దోచి పెట్టి..ఇప్పుడు నీతులా?: గజ్జెల కాంతం

ఆంధ్రా కాంట్రాక్టర్లకు దోచి పెట్టి..ఇప్పుడు నీతులా?: గజ్జెల కాంతం
  • కేసీఆర్​పై గజ్జెల కాంతం ఫైర్

హైదరాబాద్, వెలుగు: అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రా కాంట్రాక్టర్లకు దోచి పెట్టిన కేసీఆర్.. ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నాయకుడు, ప్రజాసంఘాల జేఏసీ అధ్యక్షుడు గజ్జెల కాంతం మండిపడ్డారు. పదేండ్లు అధికారంలో ఉండి ప్రాజెక్టుల పేరిట లక్షల కోట్లు దోచుకున్నది వాస్తవం కాదా? అని ఆయన ప్రశ్నించారు. గురువారం ఆయన గాంధీ భవన్‌‌లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఒక్కడు పోరాడితేనే తెలంగాణ వచ్చిందన్నట్టుగా కేసీఆర్‌‌ తో పాటు బీఆర్‌‌‌‌ఎస్ నేతలు మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అందరూ కలిసి పోరాడితేనే రాష్ట్రం వచ్చిందన్నారు. తాను స్వయంగా వెళ్లి చంద్రబాబు నాయుడు, జగన్‌‌ మోహన్‌‌ రెడ్డితో తెలంగాణకు అనుకూలంగా లేఖలు రాయించానని కాంతం గుర్తుచేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడానికి సోనియా గాంధీని ఒప్పించడంలో ఇక్కడి కాంగ్రెస్ నేతలు కీలకంగా పనిచేశారన్నారు. రాష్ట్రం రావడానికి సోనియా గాంధీనే కారణమని ఆయన ప్రశంసించారు. కాంగ్రెస్ పార్టీ మీద అనవసరమైన ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు.