బందారం ప్రజల్లో గుబులు ఊరి లోంచే రింగు రోడ్డు

బందారం ప్రజల్లో గుబులు ఊరి లోంచే రింగు రోడ్డు

ఇండ్లు, జాగాలు పోతాయని టెన్షన్​

  •     మార్కింగ్ పూర్తి చేసిన అధికారులు
  •     ఊరి మధ్య నుంచి రోడ్డు వద్దని గ్రామస్థుల వేడుకోలు

సిద్దిపేట, వెలుగు : సీఎం కేసీఆర్​ ఇలాకా గజ్వేల్​ నియోజకవర్గంలోని బందారం గ్రామంలో రింగు రోడ్డు నిర్మాణం గ్రామస్థుల ఆందోళనకు గురిచేస్తోంది. ఊరు మధ్యలో నుంచే రోడ్డు ప్లాన్​ ఉండటంతో అధికారులు ఇండ్లకు మార్కింగ్​ వేశారు. దీంతో తమ ఇండ్లను కోల్పోవాల్సి వస్తుందని బందారం ప్రజలు ఆవేదన చెందుతున్నారు. 

ఊరి మధ్యలో నుంచి రింగు రోడ్డు...

సిద్దిపేట నియోజకవర్గం చుట్టూ దాదాపు 88 కిలో మీటర్ల మేర నిర్మిస్తున్న ఈ రోడ్డు.. గజ్వేల్​ నియోజకవర్గంలోని కొండపాక మండలంలో బందారం గ్రామం మధ్యలో నుంచి వెళ్తోంది. పనుల్లో భాగంగా అధికారులు ఈ గ్రామంలో మార్కింగ్​ వేయడం పూర్తి చేశారు. ఈ మార్కింగ్​లు గ్రామస్థుల తీవ్ర ఇందోళనకు గురిచేస్తున్నాయి. నాలుగైదు ఏండ్ల కిందటే కట్టుకున్న ఇండ్లు ఇప్పుడు రోడ్డు విస్తీర్ణంలో పోతాయని తెలుసుకొని ఆవేదన చెందుతున్నారు. 

ప్రారంభం కానున్న పనులు.. 

నంగునూరు మండలం కొనాయిపల్లి నుంచి కొండపాక మండలం బందారం మీదుగా దుద్దెడ వద్ద రింగ్ రోడ్డు ముగుస్తుంది. ఇప్పటికే నంగునూరు మండలంలో డబుల్ లైన్ రోడ్డు పనులు పూర్తవడంతో దీనికి సమీపంలోని బందారం గ్రామం లో పనులు ప్రారంభం కానున్నాయి. బందారం గ్రామంలోంచి దాదాపు రెండు కిలో మీటర్లకు పైగా రింగ్ రోడ్డు ఉంది. అధికారులు ప్రస్తుతం ఉన్న రోడ్డును 66 ఫీట్ల వెడల్పుతో విస్తరించాలని మార్కింగ్ చేశారు. 
 

వంద ఇండ్లకు ముప్పు

ఎగ్జిస్ట్ రోడ్ల గుండా రింగ్ రోడ్డు నిర్మాణం చేస్తుండగా బందారం గ్రామంలో ప్రస్తుతం ఉన్న రోడ్డును విస్తరిస్తున్నారు. కిలో మీటరు మేర గ్రామం మధ్య నుంచి రోడ్డు విస్తరణ జరుగనుంది. దీంతో గ్రామంలో పూర్తిగా తొలగించాల్సిన ఇండ్లు 20 ఉండగా.. యాభై శాతం వరకు తొలగించే ఇండ్లు 70 దాకా ఉన్నాయి. ఇండ్లు కోల్పోతున్న వారికి అందే పరిహారంలో ఎలాంటి స్పష్టత లేదు. అయినా ఇప్పటికే అధికారులు గ్రామంలో మార్కింగ్  చేశారు.  

అలైన్​మెంట్​ మార్పుకు డిమాండ్

బందారం వద్ద రింగ్ రోడ్డు అలైన్మెంట్ ను మార్చాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామం బయట నుంచి రింగ్ రోడ్డు వెళ్లేలా చూడాలని కోరుతున్నారు. ఈ విషయంపై  గ్రామస్థులు అధికారులను అడిగినా  ఎలాంటి స్పందన లేదని చెబుతున్నారు . నంగునూరు మండలం కొనాయిపల్లి నుంచి పది కిలోమీటర్ల రింగ్ రోడ్డు నిర్మాణానికి రూ. 25 కోట్ల మంజూరు కావడంతో ఇటీవలే అధికారులు పనులు పూర్తి చేశారు.  అయితే తమను అన్యాయం జరుగుతోందని  గ్రామస్థుల ఆందోళన చేస్తున్న క్రమంలో   బందారం గ్రామంలో   రోడ్డును 50 ఫీట్లకే పరిమితం చేసే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. కానీ, పరిహారంపై స్పష్టత రావడం లేదు. 

కేసీఆర్ మార్గ్ గా  పేరు

సిద్దిపేట నియోజకవర్గం చుట్టూ  నిర్మిస్తున్న రింగ్ రోడ్డుకు కేసీఆర్ మార్గ్ గా పేరును ఖరారు చేశారు. కొండపాక మండలం దుద్దెడ వద్ద రాజీవ్ రహదారి నుంచి తొగుట, బుస్పాపూర్, వెంకటాపూర్, ఘనపూర్, తొర్నాల, అప్పనపల్లి, రావురూకుల, పుల్లూరు, మల్యాల, గంగాపూర్, చిన్నకోడూరు, రామునిపట్ల, పాలమాకుల , కొనాయిపల్లి కొండపాక మండలం బందారం మీదుగా దుద్దెడ వద్ద రింగ్ రోడ్డు ముగుస్తుంది. ఈ మార్గంలో వున్న పాత రోడ్డు ను విస్తరిస్తూ   రోడ్డును నిర్మిస్తున్నారు.   ఎగ్జిస్ట్ రోడ్డు ను విస్తరిస్తూ.. రింగ్​ రోడ్డు పేరుతో  పనులు నిర్వహిస్తున్నారు. దీంతో   పరిహారాల గురించి అధికారులు చెప్పడం లేదు.    ప్రస్తుతానికి డబుల్ బీటీ రోడ్డు గా ఏర్పాటు చేసి భవిష్యత్తులో మరింత విస్తరించే అవకాశాలున్నాయి. 
ఈ రింగ్ రోడ్డు నిర్మాణం వల్ల హుస్నాబాద్ నియోజవర్గ ప్రజలకు 15 నుంచి 20 కిలో మీటర్ల మేర హైదరాబాద్ ప్రయాణం తగ్గే అవకాశం ఉంది. వాహనదారులు సిద్దిపేట పట్టణంలోకి రానవసరంలేకుండానే కరీంనగర్, వరంగల్, హైదరాబాద్, మెదక్ వెళ్లేలా రింగ్ రోడ్డు ఉపయోగపడనుంది. 

రింగ్ రోడ్డుతో తీవ్రంగా నష్టపోతున్న

రింగ్ రోడ్డు వల్ల నా ఇల్లు పోతుంది.  గ్రామంలో 66 ఫీట్ల మేర విస్తరణకు మార్కింగ్ చేయడంతో మా ఇంట్లో  ఉండే పరిస్థితి ఉండదు. లక్షల రూపాయలు ఖర్చు చేసి నాలుగేండ్ల క్రితం నిర్మించుకున్న ఇల్లును ఎట్లా వదులుకోవాలి?  దుఖం ఆగడం లేదు. నాలాంటి పరిస్థితే  బందారం గ్రామంలో చాలా మందికి ఎదురవుతోంది.

కట్ట రాజు, బందారం, స్థానికులు 

 అన్యాయం చెయ్యొద్దు

రింగ్ రోడ్డు  తెచ్చి మాకు  అన్యాయం చేయొద్దు. ఊరి బయట నుంచి  రోడ్డు వేయాలి.  ఇల్లు, జాగాలు పోతే మేం ఏడుండాలి.  ఊర్ల నుంచి రోడ్డు వేసి మమ్మల్ని ఆగం జేయొద్దు.  ఇండ్లు, జాగాలు పోతే..  ఏమైనా పరిహారం ఇస్తారా అని అడిగితే ఎవరూ ఏం చెప్పడం లేదు. 

_ కిన్నెర లక్ష్మి, బందారం, స్థానికురాలు