
సిద్దిపేట, వెలుగు : గజ్వేల్ ఎన్నికల బరిలో మల్లన్న సాగర్ నిర్వాసితుడు నామినేషన్ దాఖలు చేశాడు. మల్లన్న సాగర్ ముంపు గ్రామమైన తొగుట మండలం వేములఘాట్ కు చెందిన కరుణాకర్ రెడ్డి ఇండిపెండెంట్ గా నామినేషన్ దాఖలు చేశారు. ఆయనను ప్రపోజ్ చేసింది నిర్వాసిత గ్రామాలకు చెందిన వారే కావడం గమనార్హం. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా తొగుట మండలంలో 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన మల్లన్న సాగర్ రిజర్వాయర్ తో నిర్వాసితులను ప్రభుత్వం ఆదుకోలేదని నిరసిస్తూ కరుణాకర్ రెడ్డి నామినేషన్ వేశారు.
గత ఐదేండ్లుగా ఎన్నో పోరాటాలు చేసినా మల్లన్న సాగర్ నిర్వాసితుల సమస్యలు పరిష్కారం కాకపోవడంతో నామినేషన్ వేశానని ఆయన చెప్పారు. కాగా.. హుస్నాబాద్ స్థానానికి గౌరవెల్లి నిర్వాసితులు కూడా నామినేషన్లు దాఖలు చేయడానికి సిద్ధం అవుతున్నారు. గౌరవెల్లి ప్రాజక్టు నిర్వాసిత గ్రామమైన గుడాటిపల్లికి చెందిన 17 మంది బుధవారం నామినేషన్లు వేయనున్నారు.