- కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో పని చేసినప్పుడు అక్రమాలు
- సమస్య ఉందని చెప్తే లంచంగా భూమి అడిగిన ఆఫీసర్
- ఒప్పుకోలేదని బాధితుడి బంధువులు, తన బినామీ పేరిట రిజిస్ట్రేషన్
కరీంనగర్ క్రైం, వెలుగు: నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి భూమిని ఆక్రమించిన కేసులో కొత్తపల్లి మాజీ తహసీల్దార్ చిల్ల శ్రీనివాస్ (ప్రస్తుత గజ్వేల్తహసీల్దార్)ను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీనివాస్, ఇతడి బినామి, సహకరించిన 12 మందిపై గురువారం కరీంనగర్ సీతారాంపూర్‌కు చెందిన బొంతల రఘు కొత్తపల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేయగా ముగ్గురిని అరెస్టు చేశారు. మరో 9 మంది పరారీలో ఉన్నారు. సీతారాంపూర్‌కు చెందిన రఘు తాత ఐలయ్యకు ఆరెపల్లి, సీతారాంపూర్, రేకుర్తిలో భూములున్నాయి. వీటిని రఘు తండ్రికి, అతడి సోదరుడికి 2012లో పంచి రిజిస్ట్రేషన్ చేయించాడు. అయితే, రేకుర్తిలోని సర్వే నెంబర్ 29లోని 30 గుంటలు రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ అయినా ఆన్‌లైన్‌లో కనిపించలేదు. దీంతో అప్పటి కొత్తపల్లి తహసీల్దార్ చిల్ల శ్రీనివాస్‌ను రఘు సంప్రదించాడు.
ఆ భూమి నుంచి తనకు 3.250 గుంటలు రిజిస్ట్రేషన్ చేస్తే పని చేస్తానని చెప్పాడు. దీనికి రఘు ఒప్పుకోలేదు. 2015లో ఐలయ్య చనిపోగా తహసీల్దార్ శ్రీనివాస్...2016లో రఘు నానమ్మ పేరిట ఐలయ్య రిజిస్ట్రేషన్ చేసినట్టుగా నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించాడు. రఘు బంధువులతో కుమ్మక్కై అప్పటి ధరణి ఆపరేటర్, వీఆర్ఏ పల్లె జీవన్ (ప్రస్తుత తూంకుంట మున్సిపల్ ఆఫీసు జూనియర్ అసిస్టెంట్) సాయంతో బాధితుడి చిన్నాన్న, నలుగురి మేనత్తల పేరిట నాలుగున్నర గుంటలు మార్చాడు.
అలాగే.. తహసీల్దార్ బినామీ అయిన గోదావరిఖని కళ్యాణ్‌నగర్‌కు చెందిన చందా సంతోష్ పేరిట 3.250 గుంటలు మార్చాడు. రఘు ఫిర్యాదు మేరకు పోలీసులు ఏ1గా తహసీల్దార్ శ్రీనివాస్‌ను చేర్చారు. మిగతా నిందితులుగా చంద సంతోష్, పల్లె జీవన్, బొంతల రవి, బొంతల లావణ్య, ఉప్పుల కనక లక్ష్మి, దాడి రాధ, చెప్ప మంజుల, చిలువేరు స్వప్న, చిలువేరు మల్లేశం, బుచ్చిరాజు చేర్చారు. చిల్ల శ్రీనివాస్, సంతోష్ ,పల్లె జీవన్ లను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచారు. దీంతో కోర్టు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది.