- కేసీఆర్ నిర్ణయమే ఫైనల్
- అసంతృప్తులను బుజ్జగించేందుకు సీనియర్ల ప్రయత్నాలు
సిద్దిపేట/గజ్వేల్, వెలుగు: గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తపై పెట్టిన అవిశ్వాస తీర్మాన పంచాయితీ హైకమాండ్‌కు చేరింది. పై నుంచి ఎలాంటి ఆదేశాలు వస్తాయోనని అంతా ఆసక్తికగా ఎదురుచూస్తున్నారు. అవిశ్వాసంపై పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయమే ఫైనల్‌గా మారనుంది. హైకమాండ్ నుంచి ఆదేశాలు అందేంత వరకూ కలెక్టర్ దగ్గర ఉన్న అవిశ్వాస నోటీస్ పెండింగ్‌లోనే ఉండనుంది. మరోవైపు అసంతృప్తులు ఇప్పటికీ క్యాంపులోనే ఉన్నారు. వారిలో చైర్మన్ పదవిని ఆశించే వాళ్లెవరూ లేకపోవడంతో పాటు, హైకమాండ్‌ను ధిక్కరించే పరిస్థితి కనిపించడం లేదు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు బిజీగా ఉన్నారు. అయినా గజ్వేల్ అవిశ్వాస తీర్మాన నోటీసు పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అవిశ్వాస నోటీసు ఇవ్వొద్దని అసంతృప్త కౌన్సిలర్లకు ముఖ్యనేతలు సూచించినా.. వారు పెడచెవిన పెట్టారు. వ్యూహాత్మకంగా వ్యవహరించి కలెక్టర్‌కు అవిశ్వాస నోటీసు అందించారు. ఈ వ్యవహారంపై మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ప్రచారం జరుగుతోంది.
చర్చనీయాంశమైన అవినీతి ఆరోపణలు..
గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ పై పార్టీ కౌన్సిలర్ల అవినీతి ఆరోపణలు చర్చగా మారాయి. ఒకవైపు పార్టీకి విధేయులమంటూనే చైర్మన్ అవినీతికి పాల్పడుతున్నాడని అసంతృప్త కౌన్సిలర్లు అంటున్నారు. అవినీతికి తావు లేకుండా పాలనను అందిస్తున్నామని సీఎం కేసీఆర్ చెప్తున్నా.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న చోటే చైర్మన్ అవినీతికి పాల్పడుతున్నాడని పలువురు కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. చైర్మన్ అతని కుమారుడు పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నాడని వారు బహిరంగంగా ప్రకటించారు.
అసంతృప్త కౌన్సిలర్లతో మంతనాలు...
అవిశ్వాస నోటీసులు అందజేసి క్యాంపులోకి వెళ్లిన అసంతృప్త కౌన్సిలర్లతో కొందరు ముఖ్య నేతలు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం 14 మంది కౌన్సిలర్లు అవిశ్వాస నోటీసు పై సంతకం చేయగా వారిలో మెజార్టీ వర్గీయులను వెనక్కి రప్పించడానికి తీవ్ర ప్రయత్నాలు సాగుతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గం నుంచి అధికార హోదాలో ఉన్న ఒక ముఖ్య నేత ఇప్పటికే కొందరు అసంతృప్త కౌన్సిలర్లతో మాట్లాడినట్టు సమాచారం.
మొదటి నుంచి కయ్యమే..
పాలకవర్గం ఏర్పడిన మొదటి నుంచీ కౌన్సిలర్లకు, చైర్మన్‌కు మధ్య పొసగడం లేదు. చాలా సందర్భాల్లో కౌన్సిలర్లు..చైర్మన్ వైఖరిని బహిరంగంగా ఎండగట్టినా.. సీఎం కేసీఆర్ నిర్ణయించిన వ్యక్తి కావడంతో ఎదురు తిరగలేకపోయారు. తాము పార్టీకి విధేయులమే అయినా చైర్మన్ కు మాత్రమే వ్యతిరేకమని అసంతృప్త కౌన్సిలర్లు అంటున్నారు. ఎన్నికల నేపథ్యంలో పార్టీ ఆధినేత ఇలాకాలోనే అవిశ్వాసంతో చైర్మన్ ను గద్దె దించితే, పరిస్థితులు ప్రతికూలంగా మారే ప్రమాదం ఉందని సీనియర్ నేతలు భావిస్తున్నారు. అందుకే అసంతృప్తులను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే చైర్మన్ రాజమౌళి గుప్త మాత్రం సీఎం కేసీఆర్ నిర్ణయమే తనకు ఫైనల్ అని, ఆయన మాటను జవదాటనని అంటున్నాడు. గజ్వేల్ లో అవిశ్వాస నోటీసుపై సమావేశం నిర్వహిస్తే ఇప్పటికే రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలో అవిశ్వాస నోటీసులపై సమావేశాలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. దీంతో ఈ తీర్మానంపై హైకమాండ్ నిర్ణయం కోసం వేచి చూడాల్సిందేనని స్థానిక నాయకులు అంటున్నారు.