
రామచంద్రాపురం, వెలుగు: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన బీసీ కులగణన సర్వే చారిత్రాత్మకమని, దేశంలో ఏ ప్రభుత్వం ఈ విషయంలో ముందుకు రాలేదని కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు గాలి అనిల్ కుమార్అన్నారు. శనివారం బేగంపేటలోని పూలే భవన్లో జరిగిన బీసీ ముఖ్య నేతల సమావేశంలో పాల్గొన్న అనిల్ సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్‌ను కలిశారు. అనంతరం వారికి బొకే అందజేసి ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు కానున్నాయని, దేశంలో ఏ ప్రభుత్వం చేయలేని పనిని సీఎం రేవంత్ రెడ్డి చేసి చూపించారన్నారు. తెలంగాణను ఆదర్శంగా తీసుకొని అన్ని రాష్ట్రాల్లో కుల గణన చేపట్టాలని డిమాండ్ చేశారు. బీసీ సమాజమంతా రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటుందని, దీనికి సహకరించిన కాంగ్రెస్అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ, కర్గేలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.