- ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు
- 19 మందికి మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్
- దేశవ్యాప్తంగా మొత్తం 942 మందికి అవార్డులు
న్యూఢిల్లీ, వెలుగు: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర హోంశాఖ శనివారం పోలీస్ మెడల్స్ ప్రకటించింది. ఇందులో తెలంగాణ పోలీసులకు 21 దక్కాయి. వీరిలో ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం (పీఎస్ఎం), 19 మందికి మెరిటోరియస్ సర్వీస్ మెడల్ (ఎంఎస్ఎం) దక్కింది. అడిషనల్ కమిష నర్ (లాఅండ్ ఆర్డర్) విక్రమ్‌సింగ్ మన్, ఎస్పీ మెట్టు మాణిక్‌రాజ్‌కు రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు వచ్చాయి. ఐజీ కార్తికేయ, ఎస్పీ అన్నల ముత్యంరెడ్డి, డీసీపీలు కమాల్ల రాంకుమార్, మహమ్మద్ ఫజ్లుర్ రహమాన్, డీఎస్పీలు కోటపాటి వెంకటరమణ, అన్ను వేణు గోపాల్, ఏఎస్ఐలు రణ్‌వీర్ సింగ్ ఠాకూర్, పీటర్ జోసెఫ్ బహదూర్, మహ్మద్ మొయినుల్లా ఖాన్, ఇన్ స్పెక్టర్ నిరంజన్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్స్ విదత్యా పాథ్యా నాయక్, ఎండీ అయూబ్ ఖాన్‌కు మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్ దక్కాయి. ఇక ఫైర్ సర్వీస్‌లో ముగ్గురికి, హోంగార్డ్ డిపార్ట్ మెంట్లో నలుగురికి కూడా మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్ దక్కాయి. వీరిలో ఫైర్ మెన్స్ ఎం.వెంకటేశ్వర రావు, సుబ్బయ్య చవల, జనార్దన్ కొరుకూరితో పాటు హోంగార్డులు మంత్రి ఈశ్వరయ్య, యాదగిరి మేడిపల్లి, లక్ష్మణ్ కోమటి, ఐలయ్య కల్లెం ఉన్నారు.
దేశవ్యాప్తంగా పోలీస్, ఫైర్ సర్వీస్, హోంగార్డ్ అండ్ సివిల్ డిఫెన్స్, కరక్షనల్ సర్వీస్‌లకు చెందిన మొత్తం 942 మందికి పోలీస్ మెడల్స్ ను కేంద్రం ప్రకటించింది. ఇందులో 95 మందికి గ్యాలంట్రీ మెడల్స్, 101 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం (పీఎస్ఎం), 746 మందికి మెరిటోరియస్ సర్వీస్ మెడల్ (ఎంఎస్ఎం) ఇవ్వనున్నట్టు వెల్లడించింది. ఇటీవల చత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్కౌంటర్లలో కీలకపాత్ర పోషించిన పోలీసులు, పారామిలటరీ బలగాలు, జమ్మూ-కాశ్మీర్లో టెర్రరిస్టుల ఏరివేతలో భాగమైన కేంద్ర బలగాలకు గ్యాలంట్రీ మెడల్స్‌ను కేంద్రం ప్రక టించింది. మొత్తం 95 మందికి గ్యాలంట్రీ మెడల్స్ ప్రకటించగా.. అందులో 28 మంది మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో, మరో 28 మంది జమ్మూకశ్మీర్‌లో పనిచేసినోళ్లు ఉన్నట్టు పేర్కొంది.