- మూడున్నర ఏండ్ల పదవీకాలం
- లంకతో సిరీస్‌తో బాధ్యతలు
న్యూఢిల్లీ: టీమిండియా క్రికెట్‌లో కొత్త శకం మొదలైంది. టీ20 వరల్డ్ కప్ నెగ్గి జోరుమీదున్న జట్టు మరింత గంభీరంగా ముందుకెళ్లనుంది. రాహుల్ ద్రవిడ్ స్థానంలో ఇండియా హెడ్ కోచ్‌గా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ నియమితుడయ్యాడు. ఈ మేరకు అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపే, సులక్షణ నాయక్‌తో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) మంగళవారం గంభీర్‌ను హెడ్ కోచ్‌గా ఏకగ్రీవంగా ప్రతిపాదించింది. ఈ నెల 27 నుంచి సొంతగడ్డపై శ్రీలంకతో జరిగే లిమిటెడ్ ఓవర్ల సిరీస్‌తో 42 ఏండ్ల గౌతీ బాధ్యతలు చేపట్టనున్నాడు.
ఈ టూర్‌లో ఇండియాతో లంక మూడు టీ20లు, మూడు వన్డేల్లో తలపడనుంది. మూడున్నర ఏండ్ల పాటు ఈ పదవిలో ఉండే గంభీర్ అన్ని ఫార్మాట్ల బాధ్యతలను చూసుకుంటాడు. టీమిండియాలోకి గౌతమ్ గంభీర్‌ను బీసీసీఐ స్వాగతిస్తోందని సెక్రటరీ జై షా పేర్కొన్నారు. ‘ఇండియా క్రికెట్ టీమ్ కొత్త హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్‌ని స్వాగతిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఆధునిక క్రికెట్ వేగంగా అభివృద్ధి చెందింది. ఈ మార్పును గంభీర్ చాలా దగ్గర నుంచి చూశారు. తన కెరీర్ మొత్తంలో ఆటుపోట్లను తట్టుకొని వివిధ పాత్రల్లో రాణించారు. ఇండియన్ క్రికెట్‌ను ముందుకు నడిపించడానికి గౌతమ్ సరైన వ్యక్తి అని నేను నమ్ముతున్నా’ అని ట్వీట్ చేశాడు. కాగా, గంభీర్‌తో కలిసి పని చేసే సపోర్టింగ్ స్టాఫ్ (బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌లు)ను ఎంపిక చేయాల్సి ఉంది.
సరైనోడు
టీమిండియా హెడ్ కోచ్ పోస్టుకు గౌతమ్ గంభీర్ సరైనోడు అనొచ్చు. ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలో ప్రతీ జట్టూ దూకుడైన ఆటతో ముందుకెళ్తోంది. క్రికెటర్‌గా తన కెరీర్ మొత్తం దూకుడే మంత్రంగా విజయం సాధించిన గంభీర్ జట్టును కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఆటగాడిగా 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ విజయంలో గౌతీ కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్‌లో కేకేఆర్‌కు రెండు టైటిళ్లు (2012, 2014) అందించాడు.
ఈ సీజన్‌లో మెంటార్‌గా వచ్చి కేకేఆర్ మూడోసారి ట్రోఫీ నెగ్గడంలో సాయం చేశాడు. ఆ విజయంతోనే గౌతీ ఇండియా కోచ్ కావాలన్న డిమాండ్లు మొదలయ్యాయి. 2022, 2023 సీజన్లలో లక్నో సూపర్ జెయింట్స్‌కు మెంటార్‌గా పని చేశాడు. ఆటగాడిగా అపార అనుభవం ఉన్న గంభీర్‌కు కోచింగ్‌లోనూ మంచి పట్టుంది. ముక్కుసూటితనం, క్రమశిక్షణకు మారు పేరైన గౌతీ యువ ప్రతిభను ప్రోత్సహించడంలో ముందుంటాడు.
వచ్చే ఏడాది పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చే చాంపియన్స్ ట్రోఫీ రూపంలో అతి పెద్ద సవాల్ గౌతమ్ ముందుంది. టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ వన్డే, టెస్టుల్లో కొనసాగనుండగా అతనితో పాటు షార్ట్ ఫార్మాట్‌కు రాబోయే కొత్త కెప్టెన్‌తో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన బాధ్యత గంభీర్ పై ఉండనుంది. రోహిత్‌తో పాటు కోహ్లీ, అశ్విన్, జడేజా వంటి సీనియర్లతో గౌతీ ఎలా కలిసిపోతాడన్నది ఆసక్తికరంగా మారింది.
ద్రవిడ్‌కు బోర్డు కృతజ్ఞతలు
టీ20 వరల్డ్ కప్ విజయంతో హెడ్ కోచ్‌గా బాధ్యతలను ముగించిన ద్రవిడ్‌కు బీసీసీఐ కృతజ్క్షతలు తెలిపింది. అతని హయాంలో ఇండియా గొప్ప ఘనతలు సాధించిందని సెక్రటరీ జై షా కొనియాడారు. టీ20 వరల్డ్ కప్ నెగ్గడంతో పాటు వన్డే వరల్డ్ కప్, డబ్ల్యూటీసీ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచిందన్నారు. సొంతగడ్డపై సిరీస్‌ల్లో టీమిండియా ఆధిపత్యం చెలాయించడంతో పాటు యువ ప్రతిభావంతులను గుర్తించి, వారిలో గొప్ప క్రమశిక్షణ, క్రీడాస్ఫూర్తిని పెంచడంలో ద్రవిడ్ కృషి మరవలేనిదన్నారు. బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్ కోచ్‌లుగా పనిచేసిన పరాస్ మాంబ్రే, టి. దిలీప్, విక్రమ్ రాథోడ్‌ను కూడా బోర్డు అభినందించింది.
ఇండియానే నా గుర్తింపు.
దేశానికి సేవ చేయడాన్ని నా జీవితంలో గొప్ప అవకాశంగా భావిస్తా. ఇండియా టీమ్‌లోకి తిరిగి రావడాన్ని గౌరవంగా భావిస్తున్నా. ఈసారి వేరే బాధ్యత చేపట్టినప్పటికీ నా లక్ష్యం ఎప్పటిలాగే ప్రతి భారతీయుడు గర్వపడేలా చేయడమే. బ్లూ కలర్ జెర్సీలోని ఆటగాళ్లు 140 కోట్ల భారతీయుల కలలను భుజాలపై మోస్తారు. ఆ కలలను నిజం చేయడానికి నేను నా శక్తి మేరకు కృషి చేస్తా
== గౌతమ్ గంభీర్