![శ్రేయస్‌ను తప్పించలేం : గంభీర్](https://static.v6velugu.com/uploads/2025/02/gambhir-outrightly-dismisses-iyers-shocking-claim-of-nearly-being-rested-for-1st-ind-vs-eng-odi_Ym567JqN2M.jpg)
అహ్మదాబాద్ : టీమిండియా వన్డే సెటప్ నుంచి శ్రేయస్ అయ్యర్‌ను తప్పిస్తారని వస్తున్న వార్తలను చీఫ్ కోచ్ గౌతమ్ గంభీర్ కొట్టి పారేశాడు. నిలకడగా రాణిస్తున్న శ్రేయస్ వన్డే టీమ్‌లో ఎప్పుడూ భాగంగానే ఉంటాడని స్పష్టం చేశాడు. చాంపియన్స్ ట్రోఫీలో అతను చాలా కీలకమన్నాడు. ‘శ్రేయస్‌ను బెంచ్‌పై కూర్చొబెట్టాలని ఎవరూ అనుకోరు. ఆసీస్‌లో మంచి ఫామ్ చూపెట్టిన యశస్వికి తొలి మ్యాచ్‌లో చాన్స్ ఇవ్వాలనుకున్నాం.
రన్స్ చేయకపోయినా ఒక్క ఇన్నింగ్స్‌తో యశస్వి సత్తాను అంచనా వేయలేం. రాబోయే రోజుల్లో మరిన్ని అవకాశాలు వస్తాయి. ఇప్పుడున్న సెటప్‌లో శ్రేయస్ చాలా కీలకమైన ప్లేయర్. మూడు మ్యాచ్‌లు ఉన్నాయి కాబట్టి ప్లేయర్లను రొటేట్ చేశాం. ఇప్పుడు చాంపియన్స్ ట్రోఫీ వస్తుంది. అందులో రొటేషన్ చేయలేం. అందుకే ప్లేయర్ల ఫామ్‌ను పక్కాగ పరీక్షించుకున్నాం. చాన్స్ ఉంటే ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాం’ అని గౌతీ పేర్కొన్నాడు.
బుమ్రా లేకపోవడంతో హర్షిత్ రాణా, అర్ష్‌దీప్‌కు గోల్డెన్ చాన్స్ వచ్చిందన్నాడు. ఈ ఇద్దరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించాడు. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను ఐదో ప్లేస్‌లో బ్యాటింగ్‌కు దింపడం బాగా కలిసొచ్చిందన్నాడు.