ఆరేళ్ల తర్వాత వచ్చిన గ్లోబల్ స్టార్ రాంచరణ్ సోలో ఫిలిం గేమ్ ఛేంజర్. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంకాంత్రి కానుకగా 2025, జనవరి 10వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. దర్శకుడు శంకర్, రామ్ చరణ్‌ల క్రేజ్‌తో గేమ్ ఛేంజర్ సినిమా తొలి రోజు దాదాపుగా 186 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సత్తాచాటినట్లు మూవీ యూనిట్ అఫిషియల్‌గా ప్రకటించింది.
అయితే.. భారీ హైప్‌తో విడుదలైన గేమ్ ఛేంజర్ సినిమాకు మిక్స్డ్ టాక్ రావడంతో రెండో రోజు కలెక్షన్ల కాస్తా పడిపోయాయి. మొదటి రోజు రూ.51 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన గేమ్ ఛేంజర్.. రెండో రోజు కేవలం రూ.21.5 కోట్లు మాత్రమే వసూలు చేసింది. రెండు రోజుల్లో కలిపి మొత్తం రూ.72.5 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద గేమ్ ఛేంజర్ కలెక్షన్ల వేట కొనసాగిస్తోంది. దాదాపు రూ.500కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.150 కోట్ల రూపాయల షేర్, రూ.300 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించాలని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. మిక్స్డ్ టాక్ రావడంతో సినిమా కలెక్షన్లు మెల్ల మెల్లగా డ్రాప్ అవుతున్నాయి.
అయితే, వరుసగా సంక్రాంతి సెలవులు ఉండటంతో గేమ్ ఛేంజర్ కలెక్షన్లు పుంజుకునే అవకాశం ఉందని మూవీ యూనిట్ ధీమాగా ఉంది. ఇక, ఈ సినిమాలో రామ్ చరణ్‌కి జంటగా బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వానీ నటిస్తుంచిన విషయం తెలిసిందే. ఎస్.జె సూర్య, సునీల్, శ్రీకాంత్, అంజలి తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. పొలిటికల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించాడు. డబుల్ రోల్లో రామ్ చరణ్ యాక్టింగ్ ఇరగదీసినప్పటికీ.. అంచనాలకు తగ్గట్లు కథలో బలం లేకపోవడంతో గేమ్ ఛేంజర్ మిక్స్డ్ సొంతం చేసుకుంది.