![Game Changer OTT: అఫీషియల్.. ఓటీటీకి వచ్చేసిన గేమ్ ఛేంజర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?](https://static.v6velugu.com/uploads/2025/02/game-changer-official-ott-streaming-on-amazon-prime-video_ELp90VKv5l.jpg)
గ్లోబల్ స్టార్ రామ్‍చరణ్ (Ram Charan) నటించిన గేమ్ ఛేంజర్ (Game Changer) మూవీ ఓటీటీకి వచ్చేసింది. జనవరి 10న ఐదు భాషలలో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ నేటి (ఫిబ్రవరి 7) నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, హిందీ వెర్షన్ కాస్త ఆలస్యం కానుందని ప్రైమ్ వీడియో వెల్లడించింది.
గేమ్ ఛేంజర్ రిలీజై నెల ముగియకుండానే గేమ్ ఛేంజర్ ఓటీటీకి రావడం ఆసక్తిగా మారింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సవాళ్లను ఎదుర్కొంది. అద్భుతమైన ఓపెనింగ్ ఉన్నప్పటికీ సినిమా కలెక్షన్లు భారీగా తగ్గడంతో డిజాస్టర్ మూవీస్ లిస్టులో చేరింది. ప్రస్తుతం ఈ మూవీ 2 గంటల 37 నిమిషాల డ్యూరేషన్ తో ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది.
దాదాపు రూ.400 నుండి 500కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ మూవీ డిజిటల్ రైట్స్ని అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు కొనుగోలు చేసిందని సమాచారం. అయితే, ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఆశించిన వసూళ్లను రాబట్టలేకపోయింది. 23 రోజుల్లో దాదాపు రూ.130.74 కోట్లు నెట్ వసూలు చేసింది. మొత్తం చూసుకుంటే రూ.154.85 కోట్ల నెట్ రాబట్టింది. ఈ మూవీతో నిర్మాత దిల్‍రాజు, శిరీష్ లు భారీ నష్టాలూ చవిచూడక తప్పలేదు.
కథేంటంటే:
ఏపీలో సీఎం బొబ్బిలి సత్యమూర్తి (శ్రీకాంత్) మంచి పేరుతో పాలన కొనసాగిస్తాడు. కానీ, అతని ఇద్దరు కుమారులు బొబ్బిలి మోపిదేవి (ఎస్‌జే సూర్య), రామచంద్ర (జయరామ్) చేసే పనులు పెద్ద తలనొప్పిగా మారుతాయి. అభ్యుదయ పార్టీ పరంగా వారు సత్యమూర్తి పేరు ప్రతిష్టను దిగజారుస్తారు. అలా సీఎం బొబ్బిలి సత్యమూర్తి అనారోగ్య పాలవుతాడు. దాంతో అతని కుమారులిద్దరు సీఎం కుర్చీపై కన్నేస్తారు.
ఆ నేపథ్యంలో రామ్‌నందన్ (రామ్‌చరణ్) ఐపీఎస్ (IPS) నుంచి IAS గా మారి కలెక్టర్గా.. సొంత ఊరు వైజాగ్ జిల్లాకు వస్తాడు. అవినీతికి పాల్పడే రాజకీయ నాయకులు, రౌడీలకు పర్ఫెక్ట్ రూల్స్తో ఐఏఎస్ అధికారిగా ఆట కట్టించే పనిలో ఉంటాడు. వ్యవస్థను పీడిస్తున్న అవినీతి మరియు అక్రమాలను సవాలు చేస్తూ.. న్యాయంగా ఎన్నికలను జరిపే లక్ష్యంతో పనిచేస్తుంటాడు.ఈ క్రమంలో రామ్ నందన్కి మినిస్టర్ బొబ్బిలి మోపిదేవి (ఎస్.జె.సూర్య), అతని గ్యాంగ్‌తో యుద్ధం మొదలవుతుంది.
పదవుల కోసం ఆరాటపడే మోపిదేవి ముఖ్యమంత్రి పదవి కోసం ఎలాంటి ఎత్తులు వేశాడు? అడ్డొచ్చిన ఐఏఎస్ అధికారి రామ్‌నందన్‌ని అధికార బలంతో ఏం చేశాడు? సీఎం సత్యమూర్తి చనిపోతే ముఖ్య మంత్రి అవ్వొచ్చనే తన కుమారుడి ఉద్దేశం ఎంతవరకు వెళ్ళింది? కానీ చనిపోయేముందు సీఎం సత్యమూర్తి ఓ వీడియో చేసి.. రామ్ నందన్ తన వారసుడు అని, తనే సీఎం అవ్వాలని ఎందుకు చెప్పాల్సి వచ్చింది?
చివరకి రామ్ నందన్ సీఎం అయ్యాడా? అప్పన్న, పార్వతి (అంజలి) చేసిన పోరాటం ఏంటి.. వారికి ఏమైంది? కాలేజీలో తను ప్రేమించిన దీపిక (కియారా అడ్వాణీ) కోసం రామ్ నందన్ ఏం చేశాడు? అసలు రామ్ నందన్ ఐపీఎస్ (IPS) నుంచి IAS గా ఎందుకు మారాల్సి వచ్చింది? అనే తదితర విషయాలు తెలియాలంటే గేమ్ ఛేంజర్ సినిమాను థియేటర్లో చూడాల్సిందే.