‘గేమ్ ఓవర్’ రివ్యూ..

‘గేమ్ ఓవర్’ రివ్యూ..

సినిమా: ‘గేమ్ ఓవర్’

నటీనటులు : తాప్సీ, వినోదిని వైద్యనాథన్‌, అనీష్ కురివిల్లా, సంచన నటరాజన్ తదితరులు
దర్శకత్వం: అశ్విన్ శరవణన్
సంగీతం: రోన్ ఏతాన్ యోహాన్
సినిమాటోగ్రఫి: ఎ.వసంత్
ఎడిటర్: రిచర్డ్ కెవిన్
రచన: అశ్విన్ శరవణన్, కావ్య రాంకుమార్
మాటలు: వెంకట్ కాచర్ల
నిర్మాత: ఎస్.శశికాంత్

బాలీవుడ్‌లో వరుస విజయాలు అందుకుంటున్న తాప్సీ.. తిరిగి సౌత్ లో సక్సెస్ అందుకునే ప్రయత్నంలో ఉంది. ఇందులో భాగంగా ఆమె నటించిన చిత్రం ‘గేమ్ ఓవర్’. నయనతారతో ‘మాయ’ అనే సినిమా రూపొందించిన అశ్విన్ శరవణన్ ఈ సినిమాకు దర్శకుడు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ మూవీ అనువాద రూపంలో హిందీలోనూ ఈ శుక్రవారం విడుదలైంది.

స్టోరీ..
వీడియో గేమ్ డిజైనర్ గా వర్క్ చేస్తుంటుంది స్వప్న (తాప్సీ). తల్లిదండ్రులకు దూరంగా కోకాపేట శివారులోని గేటెడ్ కమ్యూనిటీలో ఒంటరిగా ఉంటున్న స్వప్నకు పనిమనిషి కాలమ్మ (వినోదిని వైద్యనాథన్) తోడుగా ఉంటుంది. ఏడాది క్రితం తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలతో ఆమెను కొన్ని మానసిక సమస్యలు వేధిస్తుంటాయి. యానివర్సరీ రియాక్షన్ తో తను బాధపడుతోందని ఒంటరిగా ఉండొద్దని సూచిస్తాడు తనను ట్రీట్ చేసిన డాక్టర్ (అనీష్ కురువిల్లా) . మరోవైపు ఆమె వేయించుకున్న గేమింగ్ టాటూ కూడా ఆమెను ఇబ్బంది పెడుతుంటుంది. టాటూకు గతంలో చనిపోయిన అమృతకి లింక్ ఉందని తెలుసుకుంటుంది. ఈ క్రమంలో ఓసారి ఆత్మహత్యకు ప్రయత్నించి గాయపడి వీల్ ఛైర్ కు పరిమితమవుతుంది స్వప్న. ఇన్ని సమస్యల మధ్య అమ్మాయిలను కిరాతకంగా చంపుతున్న ఓ హంతకుడు తనను చంపడానికి వచ్చాడని తెలుసుకున్న స్వప్న ఏం చేసింది.. ఆ తర్వాత జరిగే పరిణామాలేంటి.. టాటూతో అమృతకు ఉన్న లింకేంటి లాంటి విషయాలు తెరపైనే చూడాలి.

ఎవరెలా..
ఈ సినిమాకు ప్లస్ పాయింట్ దర్శకుడి స్క్రీన్ ప్లే అయితే మరో ప్లస్ తాప్సీ పెర్ఫామెన్స్. స్వప్న పాత్రను తనదైన నటనతో ప్రాణం పోసింది తాప్సీ. సినిమానంతా తన భుజాలపై వేసుకు నడిపించింది. మనిమనిషిగా కీలక పాత్ర పోషించిన వినోదిని వైద్యనాథన్‌ కూడా సహజ నటనతో మెప్పించింది. అమృతగా నటించిన సంచన నటరాజన్, డాక్టర్ గా అనీష్ కురువిలా కనిపించింది కొన్ని సీన్స్ అయినా ఆయా పాత్రల్లో ఆకట్టుకున్నారు. వినోద్‌ సినిమాటోగ్రఫి, రాన్ ఏతాన్ యోహన్ నేపథ్య సంగీతం ప్రతి సీన్ ను ఆసక్తిగా మలచాయి. డ్యురేషన్ తక్కువ ఉండటం కూడా కలిసొచ్చే అంశం.

సమీక్ష..
ఒంటరిగా ఉండే అమ్మాయి, గత జ్ఞాపకాల వల్ల ఆమెకున్న భయాలు, వరుసగా జరుగుతున్న సైకో మర్డర్స్, టాటూ రూపంలో ఎదురైన హారర్ ఎలిమెంట్స్. ఇవీ ప్రధానంగా ఈ సినిమా కోసం దర్శకుడు ఎంచుకున్న అంశాలు. నిజానికి ఈ సినిమా కథ చిన్నదే. దీంతో స్క్రీన్ ప్లే పై ఎక్కువ దృష్టి పెట్టాడు. తాప్సీ నటనను పూర్తి స్థాయిలో వినియోగించుకున్నాడు. సినిమా ఆసాంతం కేవలం తాప్సీనే చూపిస్తూ బోర్ కొట్టకుండా సినిమా నడిపించడం దర్శకుడి ప్రతిభకు నిదర్శనం. నిత్యం భయపడుతూ, నిరాశలో ఉండే యువతి.. ధైర్యంగా పోరాడటమే తాప్సీ క్యారెక్టర్. హీరోయిన్ క్యారెక్టర్ ప్రొఫెషన్ అయిన వీడియో గేమ్ డిజైన్ తరహాలోనే ఈ సినిమాను కూడా మలచారు దర్శకుడు అశ్విన్. ఫస్ట్ హాఫ్ లో హీరోయిన్ ఎదుర్కొంటున్న మానసిక సమస్యల నుంచే భయపెట్టే ప్రయత్నం చేసిన దర్శకుడు.. సెకండాఫ్ ని పూర్తిగా వీడియో గేమ్ తోని త్రి లెవల్స్ తరహాలో నడిపించాడు.

ఫస్ట్ హాప్ లో కథనం కొంత నెమ్మదిగా సాగి విసిగిస్తుంది. సెకండాఫ్ లో జరిగే సీన్స్ కలా, నిజమా అనే కన్ ఫ్యూజన్ ను క్రియేట్ చేస్తూ తద్వారా థ్రిల్ చేశాడు. ఓ వైపు సైకో కిల్లర్ చేసే మర్డర్స్, మరోవైపు హారర్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి. స్టోరీ మధ్యలో ఇచ్చే క్లూస్ తో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనే విషయం చెప్పే ప్రయత్నం చేశారు. సైకో అన్నాక మర్డర్స్ చేయడం సహజం అందుకు కారణాలు చెప్పడమెందుకు అనుకున్నారేమో ఆ విషయాలని వదిలేశారు. కామెడీ, పాటలు లాంటి కథకు అడ్డుపడే అనవసర కమర్షియల్ హంగులు లేవు. సాధారణ ప్రేక్షకుల మెదడుకు పనిచెప్పేలా ఉన్న ఈ సినిమా.. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారు మాత్రం ఓ సారి వీక్షించేలా ఉంది. మొత్తానికైతే మల్టిప్లెక్స్ ఆడియన్స్ ను మాత్రమే థ్రిల్ చేస్తుంది ఈ గేమ్ ఓవర్.