- కూసుమంచి మండలంలో కొనసాగుతున్న రిపేర్లు
- నీటి విడుదల తర్వాత యూటీ దగ్గర కాల్వకు బుంగ
- ముదిగొండలో ట్యాంకర్ల ద్వారా పంటలకు నీళ్లు
ఖమ్మం జిల్లా ముదిగొండకు చెందిన బలంతు వెంకటనారాయణకు పది కుంటల పొలం ఉంది. నాగార్జున సాగర్ కాల్వలకు నీళ్లు రిలీజ్ చేస్తే, తూముల ద్వారా వచ్చే నీటితో ఏటా పొలం సాగు చేసుకునేవాడు. ఈసారి కూడా సాగర్ నిండడంతో పొలం పండుతుందన్న ఆశతో నాట్లు వేశాడు. ఇటీవల వరదల కారణంగా కాల్వలకు గండ్లు పడడం, నీళ్లు రిలీజ్ చేసే అవకాశం లేకపోవడంతో ఎండిపోతున్న పొలాన్ని కాపాడుకునేందుకు వాటర్ ట్యాంకర్లతో నీటిని అందిస్తున్నాడు.
ఒక్కో ట్యాంకర్ కు రూ.500 చొప్పున శుక్రవారం 8 ట్యాంకులు, శనివారం 10 ట్యాంకులతో వరి పంటకు నీళ్లు అందించాడు. అవి కూడా పంటకు పూర్తిగా సరిపోలేదని, డబ్బులు లేక ఉన్న వరకు పంటకు నీళ్లు అందించామని రైతు చెబుతున్నాడు. గండ్లను పూడ్చి త్వరగా కాల్వలకు నీళ్ల విడుదల చేయాలని ఆయన కోరాడు.
ఖమ్మం/ ముదిగొండ/ కూసుమంచి, వెలుగు: ఇటీవల భారీ వర్షాలు, వరదల కారణంగా సాగర్ కాల్వలకు గండ్లు పడడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆగస్టులోనే నాగార్జున సాగర్ నిండడంతో ఆయకట్టు కింద జోరుగా నాట్లు వేసుకున్నారు. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో ఒక్కసారిగా వచ్చిన వరదలతో జిల్లాలో ఐదు చోట్ల కాల్వలకు గండ్లు పడ్డాయి. దీంతో సాగర్ నీళ్లు కాల్వలకు రిలీజ్ చేసే పరిస్థితి లేకపోవడం, వర్షాలు తగ్గి తీవ్రంగా ఎండలు పెరగడంతో వరి పొలాలు నెర్రెలువారుతున్నాయి. వారం, పది రోజులుగా వాన జాడ లేకపోవడంతో నీటి తడులు లేక పొలాలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది.
జిల్లాలో సాగర్ ఆయకట్టు కింద 18 మండలాల్లో రెండున్నర లక్షల ఎకరాల్లో సాగు చేస్తారు. ఇందులో సగానికి పైగా వరి పొలాలు కావడంతో, ప్రధానంగా నీటి తడులపైనే రైతులు ఆధారపడి ఉన్నారు. మధిర బ్రాంచ్ కెనాల్ కింద ముందుగానే నాట్లు వేసుకోవడంతో పొలాలు పొట్ట దశకు చేరుకున్నాయి. ఈ సమయంలో పొలాలు ఎండిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా వైరా రిజర్వాయర్ నుంచైనా నీళ్లు ఇవ్వాలని కోరుతున్నారు.
యూటీ దగ్గర కాల్వకు బుంగ!
కూసుమంచి మండలంలోనే ప్రధానంగా కాల్వలకు డ్యామేజీ అయింది. పాలేరు పాత కాల్వకు పడిన మూడ్రోజుల కిందనే అధికారులు పూడ్చారు. ప్రధానంగా హట్యాతండాలో అండర్ టన్నెల్ (యూటీ) దగ్గర 300 మీటర్ల పొడవున కాల్వ కట్ట తెగడం, యూటీ గోడలు కూడా కూలిపోవడంతో రిపేర్లకు ఎక్కువ రోజుల సమయం పట్టింది. దాదాపు రూ.రెండున్నర కోట్లతో యూటీ కింద పైపులను వేసి, తాత్కాలికంగా పంటలకు నీళ్లిచ్చేలా పనులు చేపట్టారు.
శనివారం పనులు పూర్తి కావడంతో నీటిని రిలీజ్ చేసే ప్రయత్నం చేయగా, చేపట్టిన పనులకు సమీపంలోనే కాల్వకు మళ్లీ బుంగపడింది. దీంతో నీళ్లు రిలీజ్ చేసే పరిస్థితి లేకుండా పోయింది. మళ్లీ నీటి ప్రవాహానికి అడ్డుగా కట్టపోసి, యూటీ దగ్గర బుంగను పూడ్చివేత పనులు చేపట్టారు. ఆదివారం సాయంత్రానికి పనులన్నీ కంప్లీట్ చేసి, పంటలకు నీటిని ఇచ్చేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు.