- ప్రాజెక్టు నిర్మించి ఆలేరును సస్యశ్యామలం చేస్తామని 2018 ఎన్నికల టైమ్ లో గత సర్కారు హామీ
- సర్వే పూర్తి కాలే.. కొందరికి పరిహారం రాలే
- దానికి తోడు రైతుబంధు కూడా జమకావడంలే
- రిజర్వాయర్ పై నో క్లారిటీ
- 9.8 టీఎంసీల కెపాసిటీతో ముందుగా ప్రతిపాదనలు
- తర్వాత 4.28 టీఎంసీలకు తగ్గించిన గత ప్రభుత్వం
- ఇక కొత్త ప్రభుత్వంపైనే ఆశలు
యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలో గంధమల్ల రిజర్వాయర్‌పై గందరగోళం నెలకొంది. ఐదేండ్లు గడిచినా ప్రాజెక్టు విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. సేకరించిన భూముల్లో కొందరు రైతులకే పరిహారం వచ్చింది. మరికొందరికి రాలేదు. దీంతో ఈ రిజర్వాయర్ అసలు వస్తుందా? లేదా? అన్న విషయంలో క్లారిటీ లేకుండా ఉంది. తాజాగా కాంగ్రెస్ సర్కారు కొలువు దీరింది. కొత్త ప్రభుత్వం ఈ రిజర్వాయర్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చర్చనీయాంశంగా మారింది. 2018 ముందస్తు ఎన్నికల ప్రచారంలో అప్పటి సీఎం కేసీఆర్..
గంధమల్ల రిజర్వాయర్ నిర్మించి ఆలేరు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని ప్రకటించారు. ఈ రిజర్వాయర్ ను 9.8 టీఎంసీల కెపాసిటీతో నిర్మిస్తామని చెప్పిన గత బీఆర్ఎస్ సర్కారు.. ఆ తర్వాత రిజర్వాయర్ సామర్థ్యాన్ని 4.28 టీఎంసీలకు తగ్గించింది. 2019 ఫిబ్రవరిలో భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసింది. రిజర్వాయర్ కోసం 2,618 ఎకరాలు, కాలువల కోసం 3,841 ఎకరాలు కలిపి మొత్తం 6,459 ఎకరాలు సేకరించాలని ప్రతిపాదనలో పేర్కొన్నారు. ఈ రిజర్వాయర్ తో 64 వేల ఎకరాలు సాగులోకి వస్తాయని చెప్పారు.
ఎకరాకు రూ.6 లక్షలే ఇచ్చిన పాత సర్కారు
గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణంతో గంధమల్ల, బచ్చలగూడెం, ఇందిరా నగర్ పూర్తిగా ముంపునకు గురవుతుండగా వీరారెడ్డిపల్లితో పాటు రాజాపేట మండలంలోని పలు గ్రామాల్లో రైతులు వేల ఎకరాలను కోల్పోయే అవకాశం ఉంది. భూసేకరణ ప్రక్రియలో భాగంగా అప్పటి బీఆర్ఎస్ సర్కారు.. అటవీభూములతో పాటు రైతుల వద్ద నుంచి 300 ఎకరాలకు పైగా సేకరించింది. సేకరించిన భూములతో పాటు ఆయా సర్వే నంబర్లలోని మరో వెయ్యి ఎకరాలను పీఓబీలో చేర్చింది. దీంతో 2022 వరకూ ఆయా రైతులకు రైతుబంధు కూడా పడలేదు.
పలుమార్లు ఆఫీసర్లను కలవగా ఆ భూములను పీవోబీ నుంచి తొలగించారు. సేకరించిన భూములకు రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం ఎకరాకు రూ. 6 లక్షలుగా గత సర్కారు ప్రకటించింది. ఇంత తక్కువ మొత్తమా అంటూ రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా బీఆర్ఎస్ సర్కారు పట్టించుకోలేదు. సరికదా పరిహారం డబ్బులు కూడా రెండేండ్లుగా పెండింగ్‌లో పెట్టింది.
రెండేండ్ల తర్వాత చివరకు నిరుడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొందరి రైతుల ఖాతాల్లో ఎకరానికి రూ. 6 లక్షలు చొప్పునే జమచేశారు. మరికొందరికి పరిహారం జమ కాలేదు. వారికి రైతుబంధు కూడా రావడం లేదు. డబ్బులు వచ్చిన రైతులు తమకు పరిహారం పెంచాలని కోరుతూ పలుమార్లు ఆఫీసర్లు కలిసినా ప్రయోజనం లేకుండా పోయింది.
పరిహారం రాలే
గంధమల్ల కాల్వ కింద నాది రెండెకరాలు సర్వే తీసుకున్నరు. ఇప్పటి వరకు డబ్బులు ఇయ్యలే. రైతుబంధు కూడా పడ్తలేదు. కాలువల కింద భూములు కోల్పోతున్న బాధితులందరం కలిసి ప్రజా భవన్ లో మా భూములు మాకు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అప్లికేషన్ ఇద్దామనుకుంటున్నాం.
- రైతు ఉప్పలయ్య, బేగంపేట, రాజాపేట మండలం
రిజర్వాయర్ పూర్తయితే ఆరు మండలాలకు సాగునీరు
గంధమల్ల రిజర్వాయర్‌పై మాజీ సీఎం కేసీఆర్ ప్రకటన చేసి ఆరేండ్లు కావస్తోంది. భూసేకరణ నోటీసు ప్రక్రియ నోటీసు విడుదల చేసి ఐదేండ్లు గడిచిపోయినా.. ఇప్పటి వరకూ రిజర్వాయర్, కాలువలకు సంబంధించి సర్వే పూర్తి స్థాయిలో జరగలేదు. 9.8 టీఎంసీలను ఒకసారి, 4.28 టీఎంసీలను మరోసారి ప్రచారం జరుగుతండడంతో రైతులు గందరగోళానికి గురవుతున్నారు. నిరుడు జరిగిన ఎన్నికల ముందు గంధమల్ల రిజర్వాయర్ సామర్థ్యం 1.5 టీఎంసీలే అంటూ ప్రచారం జరిగింది. ఈ రిజర్వాయర్ నిర్మాణంపై జెడ్పీ సమావేశాల్లో పలుమార్లు సభ్యులు ప్రశ్నించినా..
ఆఫీసర్ల నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఫండ్స్ కొరత కారణంగా రిజర్వాయర్‌ను అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని, నిర్మాణం జరిగే అవకాశం కూడా లేదని నిరుడు ప్రచారం జరిగింది. దీంతో బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టు నిర్మాణంపై స్పష్టత లేకుండా పోయింది. ఈ రిజర్వాయర్ నిర్మాణం జరిగితే బొమ్మలరామారం, తుర్కపల్లి, రాజాపేట, యాదగిరిగుట్ట, ఆత్మకూరు, ఆలేరు మండలాలకు సాగునీరు అందుతుంది. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణంపై క్లారిటీ వస్తుందని రైతులు భావిస్తున్నారు.