
- దేవతా మూర్తులకు గంగ స్నానంతో ఉత్సవాలు షూరు
- తరలిరానున్న గిరిజన భక్తజనం
కోల్బెల్ట్, వెలుగు : గాంధారి ఖిల్లా మైసమ్మ జాతరకు వేళైంది. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్ట శివారులోని దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన గాంధారి మైసమ్మ జాతర శుక్రవారం ఘనంగా ప్రారంభం కానుంది. వర్షాలు కురువా లని, పంటలు బాగా పండాలని ప్రతి ఏటా మాఘశుద్ధ దేవర్ల పున్నమి సమయంలో పంటలు వేసే ముందు ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఏటా ఈ జాతర నిర్వహిస్తారు. భీమన్న దేవుడికి నైవేద్యం పెట్టి పట్నాలు వేసి ప్రత్యేక పూజలు చేస్తారు.
మూడు రోజుల పాటు జరిగే జాతరలో ఒకే చోట ఖిల్లాపైభాగంలో పెద్ద దర్వాజ వద్ద కొలువుదీరిన గాంధారి మైసమ్మ, సదర్ల భీమన్న, కాలభైరవ దేవుడు, దర్వాజ పైకమ్మీ మీద చెక్కిన లక్ష్మి దేవరను దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు. నాయక్ పోడ్ గిరిజనులు రాష్ట్రంలోని నలుమూలల నుంచే కాకుండా, ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి తరలివస్తాయి.
700 ఏండ్ల చరిత్ర.. ప్రకృతి అందాల కనువిందు
దట్టమైన అడవిలోని ప్రకృతి అందాల మధ్య 300 మీటర్ల ఎత్తైన గుట్టపై గాంధారి ఖిల్లా కోటకు 700 చరిత్ర ఉంది. కాకతీయులు, పద్మనాయక రాజులు నిర్మించిన గాంధారి ఖిల్లా కోటలో ఎన్నో అబ్బురపరిచే కట్టడాలు, కళారూపాలు, శిల్ప సంపద, విగ్రహాలు, ఆలయాలను చూడొచ్చు. గుట్టపైన ఉన్న కోటకు వెళ్లేందుకున్న మెట్లు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. గుట్టను తొలచి నిర్మించిన పెద్ద దర్వాజ వద్ద నాయక్ పోడ్ గిరిజన ఆరాధ్య దైవం గాంధారీ మైసమ్మ తల్లి కొలువై ఉంది. రాజుల ఇళ్లలో పనిచేసే దాసీల ఇండ్లు, అప్పట్లో రాజుల ఆయుధాలు దాచిన ఆనవాళ్లున్నాయి.
గాంధారి మైసమ్మ, కాలభైరవుడు, శివుడు, సదర్ల భీమన్న, విఘ్నేశ్వరుడు, పది అడుగుల ఎత్తయిన ఆంజనేయుడు, భీముడి పాదముద్రలు, ఏకశిల నాగశేషుడు, ఏనుగుల విగ్రహాలున్నాయి. 8 అడుగుల ఎత్తుతో 12 పడగల ఏకశిలా నాగశేషుడి విగ్రహం ఉంది. ఆలయానికి ఎదురుగా అప్పటి రాజుల శిలాశాసనం కనిపిస్తుంది. ఖిల్లా కింది భాగంలోని గుట్ట మధ్య మేడిచెరువు జలాశయం కనువిందు చేస్తుంది.
జాతరను సక్సెస్చేయాలి
మంచిర్యాల– మందమర్రి నేషనల్ హైవే బొక్కలగుట్ట బస్ట్ స్టేజ్ నుంచి 4కి.మీ. దూరంలోని ఖిల్లాపై జరిగే జాతరకు సర్వం సిద్ధమైంది. పర్మినెంటు స్టేజ్, ప్రత్యేక షామియానాలు ఏర్పాటు చేశారు. వాటర్ సప్లై, టాయిలెట్స్, విద్యుత్, పార్కింగ్వంటి సదుపాయాలు కల్పించారు. జాతర ఏర్పాట్లను గురువారం మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్ తో పాటు మందమర్రి తహసీల్దార్ సతీశ్, సీఐ శశిధర్రెడ్డి, క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్గద్దె రాజు, రామకృష్ణాపూర్ఎస్సై రాజశేఖర్ అన్ని విభాగాల ఆఫీసర్లు పరిశీలించారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామని, జాతరను సక్సెస్ చేసేందుకు అందరు సహకరించాలని ఆర్డీవో కోరారు. జాతర నేపథ్యంలో గురువారం సదర్ల భీమన్న వద్ద నాయక్ పోడ్ గిరిజనులు, జాతర కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు.