మంచిర్యాల జిల్లాలో గాంధారి ఖిల్లా మైసమ్మ జాతర షురూ

మంచిర్యాల జిల్లాలో గాంధారి ఖిల్లా మైసమ్మ జాతర షురూ
  • తొలి రోజు గిరిజన దేవుళ్లకు గోదావరి స్నానాలు 
  • సదర్ల భీమన్న, పోచమ్మ తల్లులకు ప్రత్యేక పూజలు
  • మూడు రోజుల జాతరకు భారీగా తరలిరానున్న భక్తులు

కోల్​బెల్ట్​,వెలుగు:  గిరిజనుల ఆరాధ్యదైవం గాంధారి ఖిల్లా మైసమ్మ జాతర శుక్రవారం ఘనంగా షురువైంది. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్ట శివారులోని రుష్యమూక పర్వత సమీపంలోని సదర్ల భీమన్న ఆలయంలో దేవాపూర్, ర్యాలీగడ్​పూర్, ఊరు మందమర్రి తదితర ప్రాంతాల నుంచి వచ్చిన ఆదివాసీ నాయక్​పోడ్​కులపెద్దల ఆధ్వర్యంలో పూజలు చేశారు.  తొలి రోజు సదర్ల భీమన్న, పోచమ్మకు పూజలు చేసి గంగస్నానానికి భక్తిశ్రద్ధలతో తరలించారు. జాతరలో కలెక్టర్ ​కుమార్​ దీపక్​పాల్గొని దేవుళ్ల ప్రతిమల పూజ గంప ఎత్తుకొని గోదావరి నదికి వెళ్లే శోభాయాత్రను ప్రారంభించారు. అనంతరం గిరిజన భక్తులు, ఆలయ , జాతర కమిటీ సభ్యులు గిరిజన వాయిద్యాలతో సుమారు10కి.మీ దూరంలోని గోదావరి నదికి శోభాయాత్రగా వెళ్లారు.

 నదిలో  దేవుళ్లకు స్నానమాచరించాక.. ఒడ్డున పట్నాలు వేసి నైవేద్యం పెట్టి ప్రత్యేక పూజలు చేశారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ,  బొక్కలగుట్ట, తిమ్మాపూర్‌‌, గద్దెరాగడి, మంచిర్యాల ప్రాంత భక్తులు ఘనంగా స్వాగతం పలుకుతూ నీరాజనాలు పట్టారు. మూడు రోజులు జరిగే జాతరలో శనివారం సదర్ల భీమన్న ఆలయం నుంచి దేవతామూర్తులను జాతర జరిగే దట్టమైన అటవీ ప్రాంతంలోని గాంధారి ఖిల్లా గుట్ట వద్దకు తరలిస్తారు. ఆదివారం తెల్లవారుజామున నుంచి ఖిల్లాపైన గాంధారి మైసమ్మకు మొక్కులు చెల్లిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్, ఇతర జిల్లాల  గిరిజనులతో పాటు ఏపీ, ఒడిశా, మహారాష్ట్ర, చత్తీస్​గడ్​రాష్ట్రాల భక్తులు భారీగా తరలివస్తారు. 

భక్తి శ్రద్ధలతో జాతర నిర్వహించుకోవాలి

 గాంధారి ఖిల్లా మైసమ్మ జాతరను భక్తిశ్రద్ధలతో  జరుపుకోవాలని కలెక్టర్​ కుమార్ దీపక్​ సూచించారు.  జాతర ప్రాంతాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మందమర్రి తహసీల్దార్​సతీశ్​, క్యాతనపల్లి మున్సిపల్​కమిషనర్​గద్దె రాజు, రామకృష్ణాపూర్​ ఎస్ ఐ రాజశేఖర్, ఇతర శాఖల అధికారులతో చర్చించారు. పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని, ఇబ్బందులు కలగకుండా  చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  క్యాతనపల్లి, మందమర్రి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో జాతరలో సానిటేషన్ నిర్వహణ​, డ్రికింగ్​ వాటర్​ సప్లై చేస్తున్నట్లు చెప్పారు. అటవీ ప్రాంతం కావడంతో అగ్ని ప్రమాదాలు జరగకుండా భద్రత చర్యలు తీసుకోవాలని సూచించారు. 

 700 ఏండ్ల కింద నిర్మించిన ఖిల్లా పైభాగం వెళ్లే మెట్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయని, కొత్తగా నిర్మించాలని నాయక్​పోడ్​గిరిజన పెద్ద, ఆలయ, జాతర కమిటీ సభ్యులు కలెక్టర్​ను కోరారు. ఖిల్లా మైసమ్మ చరిత్రను తెలిపే బుక్​ను కలెక్టర్​కు అందజేశారు.  జాతరలో భక్తుల కోసం బందోబస్తు ఏర్పాటు చేసినట్లు బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్​తెలిపారు.  డ్యూటీలు నిర్వహించే పోలీసులకు పలు సూచనలు చేశారు. కేటాయించిన ప్రాంతాల్లో వాహనాలు, షాపు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.  మైసమ్మ తల్లి దర్శనానికి క్యూ లైన్ లో వెళ్లాలని పేర్కొన్నారు. మందమర్రి, బెల్లంపల్లి, తాండూరు సీఐలు శశిధర్​రెడ్డి, అఫ్జలోద్దిన్, సిబ్బంది పాల్గొన్నారు.