సల్లంగ సూడు తల్లి .. ఘనంగా గాంధారి మైసమ్మ బోనాల జాతర

సల్లంగ సూడు తల్లి .. ఘనంగా గాంధారి మైసమ్మ బోనాల జాతర
  • వేలాది భక్తజనంతో కిక్కిరిసిన ఆలయ ప్రాంగణం
  • మొక్కులు తీర్చుకున్న ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి

కోల్​బెల్ట్, వెలుగు: మందమర్రి మండలం క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధి బొక్కలగుట్ట గాంధారి మైసమ్మ ఆషాఢ బోనాల జాతర ఘనంగా జరిగింది. ఆదివారం ఉదయం బొక్కలగుట్ట శివారులోని రాళ్ల వాగు ఒడ్డున ముందుగా పూజలు చేసి.. శివసత్తులు, మహిళలు బోనాలతో మైసమ్మ తల్లి ఆలయం వరకు ఊరేగింపుగా వెళ్లారు. జాతరకు వచ్చిన వేలాది భక్తులు మైసమ్మ తల్లికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వందల సంఖ్యలో వాహనాలకు పూజలు చేసుకున్నారు. పెద్ద ఎత్తున కోళ్లు, మేకలను బలిచ్చారు. జాతరలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.

బోనమెత్తిన వివేక్​ వెంకటస్వామి

బోనాల జాతరలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి, మాజీ జడ్పీ చైర్​పర్సన్​నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, క్యాతనపల్లి మున్సిపల్ చైర్​పర్సన్ జంగం కళ, బొక్కలగుట్ట సర్పంచ్ బొలిశెట్టి సువర్ణ అమ్మవారి బోనమోత్తారు. ఈ సందర్భంగా వివేక్​వెంకటస్వామి మాట్లాడుతూ.. ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత గాంధారి మైసమ్మ తల్లికి బోనం సమర్పించుకోవడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో వర్షాలు మంచిగా కురిసి రైతులకు పంటలు బాగా పండాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు. అమ్మవారి ఆశీస్సులతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందని, పేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోందని పేర్కొన్నారు.