కోల్‌బెల్ట్, వెలుగు : ఆదివాసీ నాయక్ పోడ్వంశీయుల ఆరాధ్య దైవం గాంధారి మైసమ్మ జాతర సంబరం అంబరాన్నంటింది. మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామశివారు అటవీ ప్రాంతంలోని గాంధారి ఖిల్లాకు ఆదివారం ఆదివాసీ గిరిజనులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మైసమ్మ తల్లికి ఘనంగా పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి జాతరలో పాల్గొని కాలబైరవుడిని దర్శించుకున్నారు.
తెల్లవారుజామున నుంచే...
ఆదివారం తెల్లవారుజామున మూడు గంటలకు ఖిల్లాలోని పెద్ద దర్వాజా వద్దనున్న గాంధారి మైసమ్మ తల్లికి ఆదివాసీ నాయక్‌పోడ్ రొడ్డ వంశీయుల కులపెద్దలు ప్రత్యేకంగా పట్నాలు వేసి పూజలు చేశారు. దీన్ని ప్రథమ పూజగా వ్యవహరిస్తారు. పెద్ద పూజ సందర్భంగా కులపెద్దలను తప్ప ఇతరులను అనుమతించలేదు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భక్తులు తరలివచ్చి కానుకలు సమర్పించారు.
డప్పు చప్పుళ్ల మధ్య, పూనకంతో ఊగుతూ బోనాలు తీసి తల్లిని దర్శించుకున్నారు. మహిళలు లక్ష్మీదేవర, తప్పెటగుళ్లు, థింసా నృత్యాలతో ఆకట్టుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ నేతృత్వంలో బందోబస్తు నిర్వహించారు. ప్రభుత్వ హెల్త్ సిబ్బంది భక్తులకు వైద్య సేవలు అందించారు. జిల్లా ట్రైబల్వెల్ఫేర్ఆఫీసర్లు, నాయక్‌పోడ్ సేవా సంఘం బాధ్యులు, క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్ పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ సాగర్‌రెడ్డి, బొక్కలగుట్ట సర్పంచ్బొలిశెట్టి సువర్ణ, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.