ఇయ్యాల్టి నుంచి గాంధారి ఖిల్లా జాతర

  •     ముగ్గురు దేవుళ్లు.. మూడు రోజుల జాతర
  •     తరలిరానున్న గిరిజన భక్తులు

కోల్​బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామశివారు దట్టమైన అటవీ ప్రాంతంలోని గాంధారి ఖిల్లాలో శుక్రవారం నుంచి  మూడు రోజులు పాటు నిర్వహించే గాంధారి మైసమ్మ జాతరకు సర్వం సిద్ధమైంది. బొక్కలగుట్టకు సుమారు 4 కి.మీ. దూరం అటవీ ప్రాంతంలో వందల మీటర్ల ఎత్తయిన కొండపై  ఒకే చోట కొలువుదీరిన గాంధారి మైసమ్మ, సదర్ల భీమన్న, కాలభైరవ దేవతలను నాయక్​పోడ్​గిరిజనులు, ఇతరులు దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు.

ఏటా జనవరి నుంచి మార్చి నెలల్లో వచ్చే దేవర్ల పున్నం(పౌర్ణమి)లో మూడు రోజుల పాటు జాతర నిర్వహిస్తారు. రాష్ట్రంలోని నలుమూలలు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, చత్తీస్​గఢ్ తదితర ప్రాంతాలకు చెందిన గిరిజన కుటుంబాలు జాతరకు తరలిరానున్నారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో  క్యాతనపల్లి మున్సిపాలిటీ ఉద్యో గులు, సిబ్బంది ఏర్పాట్లు చేశారు.

700ఏళ్ల నాటి ఖిల్లా

700 ఏళ్ల కింద కాకతీయుల కాలంలో గాంధారి ఖిల్లాను పరిపాలించినట్లు చారిత్రకారులు పేర్కొంటారు. కోటలో 10 అడుగుల ఎత్తయిన హనుమంతుడి శిలా విగ్రహం, దానిపై శంఖు, చక్రాలు చెక్కి ఉన్నాయి.

300 మీటర్ల ఎత్తయిన ఖిల్లా పైభాగానికి వెళ్లే మార్గంలో రాజుల ఇండ్లలో పనిచేసే దాసీల ఇండ్లు, రాజులు ఆయుధాలు దాచిన ఆనవాళ్లున్నాయి. కొండను తొలిచి ఏర్పాటు చేసిన పెద్ద దర్వాజా(దేవతామూర్తులు కొలువుదీరిన ప్రాంతం), గాంధారి మైసమ్మ, కాలభైరవుడు, శివుడు, సదర్ల భీమన్న, విఘ్నేశ్వరుడు, మొండి హనుమండ్లు,పది అడుగుల ఎతైన ఆంజనే యుడు, భీముని పాదాలు, బోగం గుళ్లు, 12 పడగల ఏకశిల నాగశేషుడి విగ్రహంతో ఆలయం ఉంది.

వర్షాలు కురిసి పంటలు పండాలని..

వందల ఏండ్లుగా నాయకపోడ్​ గిరిజనులు ఇక్కడ పూజలు చేస్తున్నారు. కాకతీయుల రాజైన అనపోత నాయకుని కాలంలో ‘రణము కుడుపు’ ఆచరించేవారు. వర్షాలు కురవాలని పంటలు, బాగా పండలాని.. పంటలు వేసేముందు ఏటా గిరిజనులు భీమన్న దేవుడికి నైవేద్యం పెట్టి పట్నాలు వేసి ప్రత్యేక పూజలు చేస్తారు. ఖిల్లాలోని పెద్ద దర్వాజ వద్ద మైసమ్మ తల్లి, భీమన్న దేవుడు, దర్వాజ పైకమ్మీ మీద చెక్కిన లక్ష్మీదేవరను కొలుస్తారు.