న్యూఢిల్లీ: కాంగ్రెస్ హైకమాండ్‌పై ఆ పార్టీ సీనియర్ లీడర్ మణిశంకర్ అయ్యర్ విమర్శలు చేశారు. తాను రాజకీయంగా ఎదగడానికి గాంధీ ఫ్యామిలీ ఎంత కారణమే, తాను రాజకీయంగా పతనం కావడానికి కూడా అంతే కారణమని ఆయన అన్నారు. ఎన్నో ఏండ్లు పార్టీకి సేవ చేసినా సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పీటీఐ వార్తా సంస్థకు అయ్యర్ ఇంటర్వ్యూ ఇచ్చారు. గత కొన్నేండ్లుగా గాంధీ ఫ్యామిలీని నేరుగా కలిసేందుకు తనకు అవకాశమే రాలేదన్నారు. ‘‘గత పదేండ్లలో సోనియాగాంధీని కలిసేందుకు ఒక్కసారి కూడా అవకాశం రాలేదు.
ఒకే ఒక్కసారి రాహుల్ గాంధీని కలవగా, ఒకట్రెండు సార్లు ప్రియాంకా గాంధీని కలిశాను. ప్రియాంకది దయా హృదయం.. అప్పుడప్పుడు నాకు ఫోన్ చేసి యోగక్షేమాలు అడుగుతుంటారు” అని తెలిపారు. ‘‘నేను పార్టీ నుంచి సస్పెండ్ అయిన టైమ్‌లో ఒకసారి ప్రియాంకను కలిశాను. అప్పుడు రాహుల్ బర్త్ డే ఉండడంతో తన తరఫున శుభాకాంక్షలు తెలియజేయాలని ఆమెను కోరాను. అప్పుడామె మీరెందుకు రాహుల్‌తో మాట్లాడడం లేదు? అని ప్రశ్నించారు.
దానికి నేను బదులిస్తూ.. పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాను. మా లీడర్‌తో మాట్లాడలేను” అని చెప్పాను. తన సస్పెన్షన్‌పై క్లారిటీ అడుగుతూ రాసిన లేఖకు రాహుల్ గాంధీ నుంచి ఇప్పటి వరకు జవాబు రాలేదని చెప్పారు. 2012లో సోనియా, మన్మోహన్ అనారోగ్యానికి గురైనప్పుడు ప్రణబ్ ముఖర్జీ పార్టీని, ప్రభుత్వాన్ని ఒంటి చేత్తో నడిపించారని కొనియాడారు.