
- మనీ ల్యాండరింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్ కేసుల పేరిట బెదిరింపులు
- రూ.23 లక్షల చీటింగ్
బషీర్‌బాగ్, వెలుగు: మనీ ల్యాండరింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్ కేసుల పేరుతో బెదిరించి సిటీకి చెందిన ఓ ప్రభుత్వ రిటైర్డ్ మహిళా ఉద్యోగినిని సైబర్ నేరగాళ్లు మోసగించారు. రూ.23 లక్షలను కొట్టేశారు. సికింద్రాబాద్‌కు చెందిన ప్రభుత్వ రిటైర్డ్ఉద్యోగిని(65)కి ఇటీవల టెలికాం డిపార్ట్మెంట్ నుంచి అంటూ ఓ ఫోన్ కాల్ వచ్చింది. ‘మీ పేరిట ఉన్న ఫోన్నంబర్తో కాల్స్ చేసి మోసాలకు పాల్పడినందుకు ఎఫ్ఐఆర్ నమోదైంది. మీ కాల్‌ను బెంగళూరు ఎస్సైకు ట్రాన్స్ఫర్చేస్తున్నాం’ అని స్కామర్చెప్పాడు. తర్వాత మరొక స్కామర్లైన్లోకి వచ్చాడు.
విచారణ కోసం బెంళూరుకు రావాలని బెదిరించాడు. షాక్‌కు గురైన మహిళ తాను ఎలాంటి తప్పు చేయలేదని, బెంగళూరుకు రాలేనని చెప్పింది. ఆ వెంటనే స్కామర్ఈ కేసును సైబర్ క్రైమ్ పోలీసులకు బదిలీ చేస్తున్నామని, వారు త్వరలో మిమ్మల్ని సంప్రదిస్తారని చెప్పి కట్‌చేశాడు. కొద్దిసేపటి తర్వాత మహిళకు మరో ఫోన్ కాల్ వచ్చింది. ఢిల్లీ నుంచి ఐపీఎస్ఆఫీసర్సదాసత్ ఖాన్ ను మాట్లాడుతున్నానని మహిళతో నమ్మబలికాడు. మీ పేరు మీద ముంబైలో ఓ బ్యాంక్అకౌంట్ఉందని, దాని నుంచి మనీ ల్యాండరింగ్ కు పాల్పడ్డారని బెదిరించాడు.
ఆ కేసుతోపాటు హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు కూడా నమోదైందని చెప్పాడు. మీ ప్రమేయం లేదని తేల్చాలంటే ఆర్బీఐ నిబంధనల ప్రకారం తమకు మనీ ట్రాన్స్ఫర్చేయాలన్నాడు. వెరిఫై చేశాక డబ్బు రిటర్న్ చేస్తామని నమ్మబలికాడు. ఆ వెంటనే మహిళకు నమ్మకం కలిగించేలా ఫేక్ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ పేరుతో లెటర్ పంపించాడు. తనను ఎక్కడ అరెస్ట్చేస్తారోననే భయంతో మహిళ స్కామర్ల అకౌంట్ కు మొత్తం రూ.23 లక్షలు ట్రాన్స్ఫర్ చేసింది. తర్వాత తనకు ఎలాంటి కాల్స్రాకపోవడంతో మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి తెలిపారు.