- శాలరీలు చెల్లించని కాంట్రాక్టు సంస్థలు
- సర్కార్ నుంచి బిల్లులు రావడం లేదంటూ సతాయింపు
- ఇల్లు గడవడానికి అప్పులు చేస్తున్నమని ఉద్యోగుల ఆవేదన
పద్మారావునగర్, వెలుగు: మూడు నెలలుగా జీతాల్లేక గాంధీ ఆస్పత్రిలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు తిప్పలు పడుతున్నారు. జీతాల్లేక ఇల్లు గడవడానికి అప్పులు చేస్తున్నామని ఆవేదన చెందుతున్నారు. ఆస్పత్రిలో నర్సింగ్, పేషెంట్ కేర్, క్లాస్‌ఫోర్త్, ఆరోగ్యశ్రీ, సెక్యూరిటీ తదితర విభాగాల్లో దాదాపు వెయ్యి మంది ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్నారు. వీరిలో 700 మంది వరకు గతంలో రెండు కాంట్రాక్ట్ సంస్థల కింద పని చేసేవారు. అయితే ఆ సంస్థల కాంట్రాక్టు ఫిబ్రవరిలో ముగిసింది. దీంతో లాటరీ వేసి 700 మంది సిబ్బందిని 10 కాంట్రాక్టు సంస్థలకు కేటాయించారు. అప్పటి నుంచే జీతాల సమస్య మొదలైంది. కొందరు కాంట్రాక్టర్లు అగ్రిమెంట్ల టైమ్ లో వచ్చారే తప్ప, మళ్లీ ఇప్పటి వరకు జాడే లేరని ఉద్యోగులు చెప్పారు. ఆస్పత్రి అధికారులు ఫోన్ చేసినా స్పందించడం లేదని తెలిపారు.
నిబంధనలు పాటిస్తలే...
కాంట్రాక్టు కంపెనీలు నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఏవైనా కారణాలతో ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయడంలో ఆలస్యమైనా, మూడు నెలల వరకు సిబ్బందికి క్రమం తప్పకుండా జీతాలు చెల్లించాలనే నిబంధన ఉంది. అయినప్పటికీ బిల్లులు రావడం లేదంటూ కొన్ని కంపెనీలు సిబ్బందికి జీతాలు చెల్లించకుండా సతాయిస్తున్నాయి. తమకు వచ్చేదే నెలకు రూ.8,400 అని, అదీ సక్రమంగా ఇవ్వకపోతే తమ ఇల్లు ఎట్ల గడుస్తదని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. తమ పీఎఫ్, ఈఎస్ఐ డబ్బులు కూడా సక్రమంగా ఖాతాల్లో జమ చేయడం లేదని వాపోతున్నారు.
సంస్థలకు నోటీసులిచ్చాం...
కాంట్రాక్ట్ సిబ్బందిలో చాలా మందికి మూడు నెలలుగా జీతాలు రాని మాట వాస్తవమే. కొంతమందికి మార్చి వరకు జీతాలు క్లియర్‌చేశారు. జీతాలు చెల్లించని కాంట్రాక్టు సంస్థలకు నోటీసులు ఇచ్చాం. మొత్తం 10 కాంట్రాక్ట్ సంస్థల్లో నాలుగైదు సంస్థలపై ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై ఉన్నతాధికారులతో మాట్లాడి, ఆయా సంస్థలను బ్లాక్‌లిస్టులో పెడతాం. ఇక నుంచి కాంట్రాక్ట్ సిబ్బందికి ప్రతి నెల మొదటి వారంలో జీతాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటం.
-ప్రొఫెసర్ రాజారావు,
గాంధీ సూపరింటెండెంట్