- పోషించే స్థోమత లేక గాంధీ హాస్పిటల్ ముందు ఐదు లక్షలకు బ్రోకర్లతో బేరం
- సెక్యూరిటీ గార్డులు అడ్డుకోవడంతోపారిపోయిన తల్లి, బ్రోకర్లు
- పిల్లలను వాళ్ల ఇంట్లో దింపేసిన పోలీసులు
పద్మారావునగర్, వెలుగు: భర్త వేరే మహిళతో వెళ్లిపోవడం.. పిల్లలను పోషించే స్థోమత లేకపోవడంతో ఓ తల్లి తన ఐదేండ్ల లోపు ఉన్న ముగ్గురు కొడుకులను అమ్మేందుకు ప్రయత్నించింది. గాంధీ హాస్పిటల్ ముందే బ్రోకర్లతో ఐదు లక్షలకు బేరం కుదుర్చుకుంది. అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి ఈ విషయం తెలియడంతో వారు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే తల్లితో పాటు బ్రోకర్లు అక్కడి నుంచి పారిపోయారని సెక్యూరిటీ సిబ్బంది వివరించారు. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో రెండు రోజులుగా గాంధీ హాస్పిటల్ ఓపీ బ్లాక్ వద్దే తిరుగుతున్నది. గురువారం ఉదయం సెక్యూరిటీ సిబ్బందికి అనుమానం వచ్చి ఆమె కదలికలను గమనిస్తూ వచ్చారు.
ఆమెను ఫాలో కాగా.. తన ముగ్గురు కొడుకులను ఐదు లక్షలకు అమ్మకానికి పెట్టిందని తెలుసుకున్నారు. వెంటనే చిలకలగూడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న తల్లి, బ్రోకర్లు అక్కడి నుంచి పారిపోయారు. దీంతో సెక్యురిటీ సిబ్బంది ముగ్గురు పిల్లలకు భోజనం పెట్టారు. పోలీసులు వచ్చి పిల్లల నుంచి వారి ఇంటి అడ్రస్ అడిగి తెలుసుకున్నారు. తమ తండ్రి ఇంట్లో ఉండటం లేదని, వేరే మహిళతో వెళ్లిపోయాడని పిల్లలు వివరించారు. తాము గాంధీనగర్లో ఉంటామని చెప్పారు.
దీంతో చిలకలగూడ ఇన్స్పెక్టర్ మట్టం రాజు వారిని చిలకలగూడలోని వాళ్ల ఇంట్లో దిగబెట్టారు. పిల్లలను అమ్మేందుకు ప్రయత్నించిన విషయం తమకు తెలీదన్నారు. తల్లితో పాటు బ్రోకర్ల గురించి ఆరా తీస్తున్నామని వివరించారు. గాంధీ హాస్పిటల్ ఏరియాలోనే సదరు మహిళ భిక్షాటన చేస్తూ ఉంటుందని తెలిపారు. అయితే, గాంధీ హాస్పిటల్ వద్ద మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, సెక్యురిటీ తనిఖీలు పెంచాలని స్థానికులు కోరుతున్నారు. గతంలో చాలా సార్లు సెక్యూరిటీ సిబ్బంది తనిఖీల్లో కొందరి వద్ద నుంచి గంజాయి, మత్తు పదార్థాలతో పాటు కత్తులు దొరికాయని చెబుతున్నారు. తాజాగా పిల్లల అమ్మకానికి ప్రయత్నించారని, గాంధీ హాస్పిటల్ వద్ద నిఘా పెంచాలని కోరుతున్నారు.