- సమస్త మానవాళికి మార్గదర్శి బాపూజీ
- (నేడు గాంధీ జయంతి)
నా జీవితమే నా సందేశం అని చాటిన మహనీయుడు గాంధీజీ. అహింసా మార్గంలోనే పయనించి.. సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ధీరుడు. బ్రిటిష్ పాలన నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో గాంధీ కీలకపాత్ర పోషించారు. మహాత్మా గాంధీ చేపట్టిన అహింసా ఉద్యమం యావత్ ప్రపంచానికే స్ఫూర్తిగా నిలిచింది. గాంధీజీ స్ఫూర్తి కేవలం భారతదేశానికే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక ఉద్యమాలకు, నాయకులకు ఒక దిక్సూచిగా నిలిచింది. మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా వంటి మహానాయకులు గాంధీ సిద్ధాంతాలను పాటిస్తూ, తమ దేశాల్లో అణగారిన వర్గాల కోసం పోరాడారు. గాంధీ ఆశయాలు, ఆలోచనలు ప్రపంచమంతా శాంతి, సౌభ్రాతృత్వాలకు మార్గదర్శకంగా నిలిచాయి. అక్టోబర్ 2 వ తేదీ.. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి అని దేశమంతా తెలుసు. కానీ, ఈ మహనీయుడి జన్మదినానికి మరెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. బాపూజీ జయంతిని అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా జరుపుకుంటారు. దీన్ని 2007 జూన్‌లో ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. జాతిపిత జయంతి నాడే మచ్చలేని నాయకుడు, కేంద్ర తొలి రైల్వేమంత్రి, దేశ రెండో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కూడా. ఈ ఇద్దరు మహనీయులు జన్మించిన సంవత్సరాలు వేరైనా తేదీలు ఒకటే కావడం విశేషం.
జాతీయ ఖాదీ దినోత్సవం
ఇక స్వాతంత్య్రోద్యమ చరిత్రలో విదేశీ వస్తు బహిష్కరణ కీలక పాత్ర పోషించింది. గాంధీజీ పిలుపుమేరకు భారతీయులు ఖాదీ దుస్తులు ధరించి స్వాతంత్య్ర సంగ్రామానికి మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో మహాత్ముడి జయంతిని ‘జాతీయ ఖాదీ దినోత్సవం’గా నిర్వహిస్తున్నారు. ఇదే రోజును మాదకద్రవ్య వినిమయ వ్యతిరేక దినంగానూ జరుపుతారు. అక్టోబర్ 2 నుంచి 8వ తేదీ వరకు దాన్ ఉత్సవ్ (జాయ్ ఆఫ్ గివింగ్) వారంగా పిలుస్తారు.
పేదలకు తోచినంత దానం చేయడమే ఈ ఉత్సవ సందేశం. దాతృత్వం గొప్పదనాన్ని తెలియజేయాలనే సంకల్పంతో 2009లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘మోహన్ దాస్ కరంచంద్ గాంధీ’ 1869 అక్టోబర్ 2వ తేదీన (శుక్ల నామ సంవత్సరం బాధ్రపద బహుళ ద్వాదశి శనివారం) గుజరాత్ రాష్ట్రంలోని పోర్ బందర్లో ఒక సామాన్య కుటుంబంలో జన్మించారు. అతని తండ్రి పేరు కరంచంద్ గాంధీ. తల్లి పుత్లీబాయి. 19 సంవత్సరాల వయస్సులో (1888లో) న్యాయశాస్త్ర విద్యాభ్యాసానికి గాంధీ ఇంగ్లాండ్ వెళ్లాడు. 1891లో అతను పట్టభద్రుడై భారతదేశానికి తిరిగివచ్చాడు.
జాతివివక్షపై పోరాటం
1893లో దక్షిణాఫ్రికాలోని నాటల్‌లో ఒక న్యాయ వాద (లా) కంపెనీలో సంవత్సరం కాంట్రాక్టు లభించింది. ఒక సంవత్సరం పనిమీద వెళ్లిన గాంధీ, దక్షిణాఫ్రికాలో 21 సంవత్సరాలు (1893 నుంచి 1914 వరకు) గడిపాడు. కేవలం తెల్లవాడు కానందువల్ల రైలు బండి మొదటి తరగతి నుంచి నెట్టివేయడం, హోటళ్లలోకి రానివ్వకపోవడం వంటి జాతి వివక్షత అతడికి సమాజంలో జరుగుతున్న అన్యాయాలను కళ్లకు కట్టాయి. వాటిని ఎదుర్కొని పోరాడే పటిమను అతను పెంచుకున్నాడు. ఒక విధంగా భారతదేశంలో స్వాతంత్ర్య పోరాట నాయకత్వానికి ఇక్కడే బీజం పడింది.
1915లో గాంధీ భారతదేశానికి తిరిగి వచ్చాడు. భారతదేశంలో స్వాతం త్ర్యోద్యమం అప్పుడే చిగురు వేస్తున్నది. భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాల్లో గాంధీ పాల్గొనసాగాడు. అప్పటి ప్రధాన నేతల్లో ఒకరైన గోపాలకృష్ణ గోఖలే గాంధీకి భారత రాజకీయాలను పరిచయం చేశాడు. గాంధీ 1918లో చంపారన్, ఖేడా సత్యాగ్రహాలు నిర్వహించాడు. ఇందులో ఉక్కుమనిషిగా పేరొందిన సర్దార్ వల్లభభాయ్ పటేల్ గాంధీకి కుడిభుజంగా నిలిచాడు. ఈ కాలంలోనే గాంధీని ప్రజలు ప్రేమతో ‘బాపు’ అనీ, ‘మహాత్ముడు’ అనీ పిలిచేవారు. 1921లో భారత జాతీయ కాంగ్రెస్‌ను పునర్వ్యవస్థీకరించి, తమ ధ్యేయం ‘స్వరాజ్యం’ అని ప్రకటించాడు.
గాంధీజీ కలలను నిజం చేయాలి
1930 మార్చిలో ఉప్పుపై విధించిన పన్నును వ్యతిరేకిస్తూ ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించాడు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 6 వరకు అహ్మదాబాద్ నుంచి దండి వరకు 400 కి.మీ. పాదయాత్ర చేపట్టడం స్వాతంత్ర్య పోరాటంలో కలికితురాయి. 1931లో గాంధీ-–ఇర్విన్ ఒడంబడిక ప్రకారం ఉద్యమం ఆపారు. 1932లో లండన్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాలకు భారత జాతీయ కాంగ్రెస్ ఏకైక ప్రతినిధిగా గాంధీ హాజరయ్యారు. 1936లో లక్నో కాంగ్రెస్ సమావేశం నాటికి మళ్లీ గాంధీ ప్రధాన పాత్ర పోషించారు. బ్రిటిష్ వారు భారతదేశాన్ని వదలిపోవాలని డిమాండ్ చేస్తూ 1942లో ‘క్విట్ ఇండియా’ ఉద్యమం ప్రారంభమైంది.
ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల ద్వారా ఆయన బ్రిటిష్ పాలనను బలహీనపరిచారు. దీంతో 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించింది. 1948 జనవరి 30వ తేదీన ఢిల్లీలో బిర్లా నివాసం వద్ద గాంధీని నాథూరామ్ గాడ్సే కాల్చి చంపాడు. నేలకొరుగుతూ గాంధీ ‘హే రామ్’ అన్నాడని చెబుతారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా సమానత్వం, శాంతి కోసం చేపట్టిన పోరాటాలకు ఆయన జీవితం, సిద్ధాంతాలు ప్రేరణగా నిలిచాయి. సమస్త మానవాళికి బాపూజీ ఎంచుకున్న మార్గం అనుసరణీయం. ఆచరణీయం. సామరస్యం, సమానత్వం, న్యాయం కోసం గాంధీ తన జీవితం అంకితం చేశారు. గాంధీజీ కన్న కలలను నిజం చేయాలి. ఇదే ఆ మహాత్ముడికి మనం అందించే ఘనమైన నివాళి.
వెలిచాల రాజేందర్రావు, కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్