నల్గొండ అర్బన్, వెలుగు: బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు లేదని, బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు ఏం చేశారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు గండిచెర్వు వెంకన్న గౌడ్ ప్రశ్నించారు. మంగళవారం స్థానిక సంఘం ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క బీసీకి కూడా న్యాయం జరగలేదని ఆరోపించారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఓట్ల కోసమే కవిత బీసీ జపం చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో కుల గణన తీర్మానాన్ని ఆమోదించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి థాంక్స్ చెప్పారు. కులగణనతో పాటు బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలంతా కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని పిలపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు సునీల్, సులేమాన్, నాగరాజు, సైదులు, మణికుమార్, కత్తుల కోటి, చింతపల్లి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.