
భూపాలపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సతీసమేతంగా టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. సోమవారం టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయనభార్య, భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి భేటీ అయ్యారు. అనంతరం గండ్ర ఓ ప్రకటన విడుదల చేశారు. నియోజకవర్గాన్ని అభివృద్ధిపథంలో ముందంజలో నిలపడానికే తాను పార్టీ మారుతున్నట్లు ప్రకటించారు. తన భార్య జ్యోతి కూడా టీఆర్ఎస్ లో చేరుతున్నారని ఆయన తెలిపారు. అన్నివర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నందునే కేసీఆర్ కుప్రజలు రెండోసారి అధికారమిచ్చారని ప్రశంసించారు. నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను కేసీఆర్ మార్గనిర్దేశకత్వంలో పూర్తి చేస్తానని తెలిపారు.అవసరమైతే కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చిన పదవులన్నింటికీ రాజీనామా చేయడానికి కూడా తానుసిద్ధమేనని గండ్ర వెంకట రమణారెడ్డి స్పష్టం జేశారు.కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్‌రెడ్డికి గండ్ర జ్యోతి లేఖ రాశారు. తనభర్త వెంకటరమణారెడ్డి టీఆర్‌ఎస్ లో చేరుతున్న నేపథ్యంలో, తాను కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం భావ్యంకాదని, అందుకే రాజీనామా చేస్తున్నానని ఆమె లేఖలోపేర్కొన్నారు.