
- హత్యపై సీబీఐతో విచారణ జరిపించాలి
- నాపై కావాలనే ఆరోపణలు చేస్తున్నరు: గండ్ర
- వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నరు
- హత్యా రాజకీయాలు కాంగ్రెస్‌కే అలవాటని వ్యాఖ్య
- నాపై కావాలనే ఆరోపణలు: గండ్ర వెంకటరమణారెడ్డి
హైదరాబాద్, వెలుగు: భూపాలపల్లిలో జరిగిన రాజలింగమూర్తి హత్యపై సీబీఐ లేదా సీఐడీతో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కోరారు. ఈ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నానని, దీనిపై సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గురువారం తెలంగాణ భవన్ లో మీడియాతో గండ్ర మాట్లాడారు. ఈ హత్యపై వాస్తవాలు తెలుసుకోకుండా కాంగ్రెస్ మాట్లాడుతున్నదని మండిపడ్డారు.
ఈ హత్యను బీఆర్ఎస్, కేటీఆర్, హరీశ్ రావుకు ఆపాదించాలని ప్రయత్నం చేస్తున్నదని ఫైర్ అయ్యారు. ‘‘మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మతిభ్రమించింది. బట్ట కాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారు. హత్యా రాజకీయాలు కాంగ్రెస్ కే అలవాటు. బీఆర్ఎస్ పై, నాపై ఆరోపణలు చేయడం ద్వారా విచారణను ప్రభావితం చేయాలని కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘స్థానికంగా ఉన్న భూవివాదం నేపథ్యంలోనే రాజలింగమూర్తి హత్య జరిగిందని ఎఫ్ఐఆర్ నమోదైంది. కొందరి ఒత్తిడితోనే రాజలింగమూర్తి భార్య నాపై ఆరోపణలు చేస్తున్నారు. మేడిగడ్డపై రాజలింగమూర్తి కోర్టులో కేసు వేశారు. దాన్ని మేం న్యాయపరంగా ఎదుర్కొంటున్నాం. రాజలింగమూర్తి భూవివాదాల్లో ఇరుక్కుపోయారు. ఆయనపై రౌడీ షీట్ కూడా ఉంది” అని పేర్కొన్నారు.