ఆరోపణలు నిరూపించకపోతే చెప్పుతో కొడ్తా : గండ్రత్ సుజాత

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్​ కాంగ్రెస్​అభ్యర్థి కంది శ్రీనివాస్ రెడ్డిపై టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత విరుచుకుపడ్డారు. తనపై చేసిన తప్పుడు వ్యాఖ్యలను నిరూపించకపోతే చెప్పుతో కొడతానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం ఆదిలాబాద్ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో కంది శ్రీనివాస్​తనపై వ్యక్తిగత ఆరోపణలు చేశాడని, అనుచిత పదజాలంతో దూషించాడని మండిపడ్డారు. 30 ఏండ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నానని, ఓ మహిళగా ఈ స్థాయికి ఎదిగిన తనను.. డబ్బులు తీసుకున్నారంటూ ఆరోపించడాన్ని ఖండించారు. అమెరికా నుంచి వచ్చి ఏమాత్రం రాజకీయ అనుభవం లేని కంది ఓ బజారు రౌడీలా ప్రవర్తిస్తున్నాడని ఫైర్​అయ్యారు. 

కేవలం వ్యక్తిగత దూషణలకు దిగుతూ ఓట్లు రాబట్టుకోవాలని నీచమైన కుట్ర పన్నుతున్నాడని, ప్రజలకు తామెలాంటి వారిమో తెలుసన్నారు. కోట్లు పెట్టి టికెట్ కొనుక్కుని పనికిరాని మాటలు మాట్లాడుతున్నారన్నారు. కంది శ్రీనివాస్​కు దమ్ముంటే ఆరోపణలను నిరూపించాలని సవాల్​విసిరారు. ఓ మహిళ అని చూడకుండా తనను శూర్పణఖతో పోలుస్తూ ముక్కు కోస్తానంటూ అసభ్య పదజాలంతో దూషించడం సిగ్గుచేటన్నారు. ఆదిలాబాద్ ఇన్సూరెన్స్ కంపెనీ పేరిట ప్రజల దగ్గర రూ.కోట్లు దోచుకొని కంది శ్రీనివాస్ రెడ్డి అమెరికా పారిపోయాడని ఆరోపించారు. మళ్లీ అమెరికాలో రూ.కోట్లు దోచుకుని కేసులు నమోదైతే ఆదిలాబాద్ కు పారిపోయి వచ్చాడని..వారం రోజుల్లో అతడి అక్రమాలన్నీ బయటపెడతామని హెచ్చరించారు. 

ఓటమి భయంతోనే తమపై కంది కంది శ్రీనివాస్ ఆరోపణలు చేస్తున్నారని, బౌన్సర్లను పెట్టుకొని బెదిరించాలని చూస్తున్న అతడికి తమ కార్యకర్తలే బుద్ధి చెబుతారని ఇండింపెండెంట్ అభ్యర్థి సంజీవ రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే నీచమైన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాగా, కంది శ్రీనివాస్​రెడ్డి..తనను దూషించాడని సుజాత అదిలాబాద్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేయగా, ఆమె భర్త ఆశన్న బేల పోలీస్ స్టేషన్లో కంప్లయింట్​చేశారు. దీంతో ఐపీసీ 294(b),506, 509,117 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని ఆదిలాబాద్ డీఎస్పీ ఉమేందర్​తెలిపారు.