Vinayaka Chavithi 2024: వినాయక చవితి.. విగ్రహ ప్రతిష్టాపనకు శుభ సమయం ఎప్పుడంటే..

Vinayaka Chavithi 2024: వినాయక చవితి.. విగ్రహ ప్రతిష్టాపనకు శుభ సమయం ఎప్పుడంటే..

మానవులకే కాదు.. సర్వ దేవతల విఘ్నాలు తొలగించే వాడు విఘ్నేశ్వరుడు. చిన్న పూజ మొదలు అతి పెద్ద యాగం నిర్వహించాలన్నా తొలుత పూజలందుకే ఒకే ఒక్క దేవుడు వినాయకుడు. ఆయన జన్మదినాన్ని వినాయక చవితిగా జరుపుకుంటారు

ఏ సమయంలో పూజించాలంటే..

ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీ.. అంటే శనివారం వినాయక చవితిని భక్తులు భక్తి శ్రద్దలతో జరుపుకోనున్నారు. అలాంటి వేళ వినాయకుడిని ఈ శుభ సమయంలో పూజించాలని శాస్త్ర పండితులు స్పష్టం చేస్తున్నారు. 2024, సెప్టెంబర్ 6వ తేదీ మధ్యాహ్నం 3:01 గంటలకు చతుర్థి తిధి ప్రారంభమవుతుంది. మర్నాడు అంటే సెప్టెంబర్ 7వ తేదీ సాయంత్రం 5:37 గంటలకు ముగియనుంది.

దృక్ పంచాంగ్ ప్రకారం, గణేష్ చతుర్థి రోజున శుభ ముహూర్తం సెప్టెంబర్ 7న ఉదయం 11:03 నుండి మధ్యాహ్నం 1:34 వరకు ఉంటుంది.  అయితే సూర్యుడు ఉదయించే సమయాన్ని బట్టి సిద్దాంతులు శుభముహూర్తాన్ని నిర్ణయిస్తారు.  ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమయంలో సూర్యుడు ఉదయిస్తాడు.  ఈ కాల వ్యవధి నిమిషాల్లోనే ఉంటుంది.  అందుకే ప్రపంచ వ్యాప్తంగా వినాయకచవితిని సెప్టెంబర్​ 7న జరుపుకుంటారు.  పంచాంగ కర్తలు తెలిపిన వివరాల ప్రకారం  ఏ ప్రాంతంలో ఏ సమయంలో శుభముహూర్తం ఉందో తెలుసుకుందాం. . . 

  • హైదరాబాద్ - ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 01:28 వరకు
  • పూణే - ఉదయం 11:18 నుండి మధ్యాహ్నం 01:47 వరకు
  • ముంబై - ఉదయం 11:22 నుండి మధ్యాహ్నం 01:51 వరకు
  • న్యూఢిల్లీ - ఉదయం 11:03 నుండి మధ్యాహ్నం 01:34 వరకు
  • గుర్గావ్ - ఉదయం 11:04 నుండి మధ్యాహ్నం 01:35 వరకు
  • నోయిడా - ఉదయం 11:03 నుండి మధ్యాహ్నం 01:33 వరకు
  • చెన్నై - ఉదయం 10:53 నుండి మధ్యాహ్నం 01:21 వరకు
  • జైపూర్ - ఉదయం 11:09 నుండి మధ్యాహ్నం 01:40 వరకు
  • చండీగఢ్ - ఉదయం 11:05 నుండి మధ్యాహ్నం 01:36 వరకు
  • కోల్‌కతా - ఉదయం 10:20 నుండి మధ్యాహ్నం 12:49 వరకు
  • బెంగళూరు - ఉదయం 11:04 నుండి మధ్యాహ్నం 01:31 వరకు
  • అహ్మదాబాద్ - ఉదయం 11:23 నుండి మధ్యాహ్నం 01:52 వరకు


వినాయకుడు మధ్యాహ్నం జన్మించాడనే ఓ నమ్మకం భక్తుల్లో చాలా బలంగా నెలకొంది. దీంతో వినాయకుడిని పూజించడానికి అత్యంత శుభమైన కాలం మధ్యాహ్నం అని వారు పేర్కొంటున్నారు. అలాగే పూజ కోసం వినాయకుడి విగ్రహాన్ని ఇంటికి తీసుకు రావడానికి అనువైన సమయం.. సెప్టెంబర్ 7వ తేదీ మధ్యాహ్నమని వారు చెబుతున్నారు.అందుకు శుభ యోగం ఉదయం 11:03 గంటల నుంచి మధ్యాహ్నం 1:34 వరకు ఉందన్నారు. అంటే 2024లో గణేశుడి విగ్రహ ప్రతిష్ఠాపనకు రెండున్నర గంటలు (150 నిమిషాలు) శుభ ముహూర్తమని ఈ సందర్భంగా శాస్త్ర పండితులు వివరిస్తున్నారు.


వినాయక చవితి రోజు అనేక శుభయోగాలు..

ఇక ఈ ఏడాది వినాయక చవితి సందర్బంగా అనేక శుభ యోగాలు ఏర్పడనున్నాయి వారు చెబుతున్నారు. అందులో ఒకటి సర్వార్థ సిద్ది యోగం ఉందన్నారు. ఆ రోజు అన్ని గ్రహాల స్థానం పరిపూర్ణంగా ఉంటుందని వారు తెలిపారు. ఈ యోగాల్లో వినాయకుడి భక్తి శ్రద్దలతో పూజించడం వల్ల మరింత శుభ ఫలితాలుంటాయని వివరిస్తున్నారు. భద్రపద శుద్ద చవితి రోజు.. సెప్టెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం 12.34 గంటలకు ప్రారంభమై.. సెప్టెంబర్ 8వ తేదీ ఉదయం 6.30 గంటల వరకు ఈ యోగం కొనసాగనుందని చెప్పారు.అదే రోజు.. రవి యోగం ఏర్పడనుంది. సెప్టెంబర్ 6వ తేదీ ఉదయం 9.35 గంటల నుంచి ఆ మరునాడు అంటే సెప్టెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం 12.34 గంటల వరకు ఈ యోగం కొనసాగనుందని పేర్కొన్నారు. అలాగే అదే రోజు బ్రహ్మ యోగం సైతం ఏర్పడుతుందని వారు వివరిస్తున్నారు. ఇది కూడా అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారని శాస్త్ర పండితులు  వివరిస్తున్నారు.