కిచెన్ తెలంగాణ : వినాయకచవితి స్పెషల్ స్వీట్స్..ఇంట్లోనే ఇలా ఈజిగా చేసేయచ్చు

కిచెన్ తెలంగాణ : వినాయకచవితి స్పెషల్ స్వీట్స్..ఇంట్లోనే ఇలా ఈజిగా చేసేయచ్చు

ఈ వారంలోనే బొజ్జ గణపయ్య పండుగ. వినాయకచవితి పండుగ వేళ బియ్యప్పిండితో రకరకాల వంటకాలు చేస్తారనే విషయం తెలిసిందే. అయితే పండుగ ఏదైనా తీపి వంటలు కామన్. అయితే అవి కూడా ఎప్పుడూ చేసుకునేవి కాకుండా కాస్త కొత్తగా, వెరైటీగా ట్రై చేస్తే బాగుంటుంది కదా! అలాంటి వెరైటీ  స్వీట్లపై ఓ లుక్కేయండి. వండి వడ్డించండి.

షిర్వాలే

కావాల్సినవి :

నీళ్లు : ఒకటిన్నర కప్పు
ఉప్పు : సరిపడా
నెయ్యి : ఒక టీస్పూన్
బియ్యప్పిండి : ఒక కప్పు
కొబ్బరి పాలు : ఒక కప్పు
బెల్లం : అర కప్పు
జీలకర్ర పొడి : ఒక టీస్పూన్
కుంకుమ పువ్వు సిరప్ : కొంచెం
యాలకుల పొడి : పావు టీస్పూన్
అరిటాకులు : సరిపడా

తయారీ : కొబ్బరి పాలలో బెల్లం, జీలకర్ర పొడి, కుంకుమ పువ్వు సిరప్, యాలకుల పొడి, ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టాలి. ఒక పాన్​లో నీళ్లు కాగబెట్టాలి. అవి మరిగాక అందులో నెయ్యి, చిటికెడు ఉప్పు, బియ్యప్పిండి వేసి కలపాలి. మూతపెట్టి రెండు నిమిషాలు ఉడికించి కాసేపు పక్కన పెట్టాలి. ఆ తర్వాత పిండిని ముద్దగా కలపాలి. అందులో కొంచెం పిండి తీసుకుని నూనె పూసి చక్రాల్లా వత్తాలి. వాటిని ఇడ్లీ పాత్రలో పెట్టి ఆవిరి మీద ఉడికించాలి. అందుకోసం ఇడ్లీ ప్లేట్​లో నూనె పూసిన అరిటాకు వేసి దాని మీద వీటిని పెట్టాలి. మూతపెట్టి ఐదు నిమిషాలు ఉడికించాక వాటిని ఒక చిన్న ప్లేట్​ లేదా కప్​లో వేసి.. రెడీ చేసిన బెల్లం మిశ్రమాన్ని పోయాలి. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే మరాఠీ షిర్వాలే స్వీట్ రెడీ.

రైస్ బర్ఫీ 

కావాల్సినవి :

బియ్యం : ఒక కప్పు
నెయ్యి : ఒక టేబుల్ స్పూన్
బాదం, జీడిపప్పులు : ఒక్కోటి ఐదు చొప్పున
నీళ్లు : ఒక టేబుల్ స్పూన్ 
చక్కెర : ముప్పావు కప్పు
పాలు : రెండు కప్పులు

తయారీ : పాన్​లో నెయ్యి వేడి చేసి బియ్యాన్ని రంగు మారేవరకు వేగించాలి. అవి చల్లారాక మిక్సీజార్​లో వేగించిన బియ్యంతోపాటు బాదం, జీడిపప్పులు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి. మరో పాన్​లో నీళ్లు పోసి, చక్కెర కరిగించాలి. పాకం చిక్కబడ్డాక పాలు పోసి బాగా కలపాలి. ఆ రెండూ బాగా కలిసిపోయాక బియ్యప్పిండి మిశ్రమం వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. కొంచెం నెయ్యి వేసి కాసేపటివరకు కలపాలి. నెయ్యి పూసిన గిన్నెలో తయారైన మిశ్రమాన్ని వేసి సమంగా పరవాలి. అది చల్లారాక గిన్నెను బోర్లించి, చాకుతో ముక్కలుగా  కట్ చేయాలి.  

పుటాంగ్ బిగాస్

కావాల్సినవి :

బియ్యం : మూడున్నర  కప్పులు
చక్కెర : ఒకటిన్నర కప్పులు
బేకింగ్ పౌడర్ : ఒకటిన్నర టేబుల్ స్పూన్లు
ఉప్పు : సరిపడా
పాలు : ఒకటి ముప్పావు కప్పు
నీళ్లు : ఒక కప్పు
వెనీలా ఎసెన్స్ : అర టీస్పూన్
అరిటాకులు : సరిపడా

తయారీ : గిన్నెలో బియ్యప్పిండి, చక్కెర, బేకింగ్ పౌడర్, ఉప్పు కలపాలి. అందులో పాలు, నీళ్లు, వెనీలా ఎసెన్స్ వేసి ఈ మిశ్రమం మృదువుగా అయ్యే వరకు కలపాలి. గిన్నెమీద మూతపెట్టి పావుగంటసేపు పక్కన పెట్టాలి. అరిటాకులను అచ్చుల్లా తయారుచేసి అందులో ఈ మిశ్రమం పోయాలి. వీటిని పావుగంటపాటు ఆవిరి మీద ఉడికించాలి. చల్లారాక తింటే టేస్టీగా ఉంటాయి పుటాంగ్ బిగాస్. 

నాన్​బెరెంజి

కావాల్సినవి :

బియ్యప్పిండి : రెండు కప్పులు
యాలకుల పొడి : అర టీస్పూన్
చక్కెర : రెండు టేబుల్ స్పూన్లు
వెన్న : అర కప్పు 
నూనె : పావు కప్పు
పాలు : పావు కప్పు
పిస్తా పప్పులు : కొన్ని
పాకం కోసం : చక్కెర : ముప్పావు కప్పు
నీళ్లు : అర కప్పు

తయారీ : పాన్​లో నీళ్లు పోసి, చక్కెర వేసి పాకం వచ్చేవరకు మరిగించాలి. పాకం చల్లారే వరకు పక్కన పెట్టాలి. ఒక గిన్నెలో బియ్యప్పిండి, యాలకుల పొడి వేసి కలపాలి. మరో గిన్నెలో చక్కెర, నూనె, వెన్న వేసి అన్నీ కలిసేలా మిక్స్​ చేయాలి. ఆ మిశ్రమాన్ని బియ్య ప్పిండిలో వేసి కలిపి, అందులోనే కొంచెం కొంచెంగా చక్కెర పాకం వేస్తూ కలపాలి. ఆపై మూత పెట్టి ఫ్రిజ్​లో దాదాపు ఆరుగంటలు లేదా రాత్రంతా ఉంచాలి. తర్వాత మిశ్రమాన్ని బయటకు తీసి చిన్న ఉండలు చేయాలి. ఆ ఉండల్ని నూనె పూసిన ప్లేట్ లేదా బటర్ పేపర్ మీద పెట్టి చేత్తో అదమాలి. పైనుంచి స్పూన్​ లేదా ఫోర్క్​తో మీకు నచ్చిన డిజైన్ వేయొచ్చు. దాని మీద పిస్తా పలుకులు పెట్టాలి. పాన్​లో కుక్కర్​ స్టాండ్ పెట్టి మూతపెట్టి వేడి చేయాలి. తర్వాత అందులో నాన్ బెరెంజి పేర్చుకున్న ప్లేట్ పెట్టి మూతపెట్టాలి. పావు గంట ఉడికిస్తే సరిపోతుంది. ఒవెన్​లో అయితే పది నుంచి పదిహేను నిమిషాలు ఉడికించాలి. ఉడికిన నాన్​ బెరెంజిలను బయటకు తీశాక ఐదు నిమిషాలు చల్లారనివ్వాలి. చల్లారిన వీటిని గాలి చొరబడని గాజు సీసాలో పెడితే మూడు రోజుల వరకు ఫ్రెష్​గా ఉంటాయి.  

స్టీమ్డ్ స్వీట్

కావాల్సినవి :

పాలు, బియ్యప్పిండి, కొబ్బరి పొడి : ఒక్కో కప్పు
చక్కెర : ముప్పావు కప్పు
యాలకుల పొడి : అర టీస్పూన్
నూనె : సరిపడా

తయారీ : పాన్​లో పాలు వేడిచేశాక అందులో చక్కెర వేసి కలపాలి. తర్వాత బియ్యప్పిండి వేసి మిశ్రమం దగ్గరపడేవరకు బాగా కలపాలి. ముద్దగా అయ్యాక కొంచెం పిండి తీసుకుని సన్నగా, పొడవుగా తాడులా చేయాలి. ఆపై దాన్ని గుండ్రంగా చుట్టాలి. వీటిని కొబ్బరి పొడిలో దొర్లించాలి. ఆ తర్వాత ఇడ్లీల్లా ఉడికించాలి. అందుకు ఇడ్లీ పాత్రలో నీళ్లు వేడి చేయాలి. ఇడ్లీ ప్లేట్ల​కి నూనె పూసి తయారుచేసిన వాటిని పెట్టి, ఇడ్లీ పాత్రలో పెట్టాలి. ఆవిరి మీద పది నిమిషాలు ఉడికిస్తే.. టేస్టీగా ఉండే స్టీమ్డ్ స్వీట్ రెడీ.