సిటీ నెట్వర్క్, వెలుగు : గ్రేటర్ పరిధిలోని మండపాల్లో ప్రతిష్ఠించిన గణనాథులు భక్తుల నుంచి విశేష పూజలు అందుకుంటున్నారు. మరోవైపు అధికారులు నిమజ్జనాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం చాలాచోట్ల వినాయకులను నిమజ్జనం చేశారు. హుస్సేన్‌సాగర్, సరూర్‌నగర్‌చెరువు, బేబీ పాండ్స్, ఇతర చెరువుల వద్ద భక్తుల సందడి కనిపించింది. హిందూ ఉత్సవ సమితికి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి రూ.3,51,000 విరాళంగా అందజేశారు.
గాంధీ హాస్పిటల్ ఆవరణలోని శ్రీసాయిబాబా ఆలయంలో ఏర్పాటు చేసిన గణనాథుడికి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజకుమారి ఇతర వైద్యాధికారులు పూజలు చేశారు. జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా శోభన్ రెడ్డి సోమవారం చిలకలగూడలో నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు.
వేర్వేరు ప్రాంతాల్లో పర్యటించి అధికారులకు పలు సూచనలు చేశారు. సరూర్‌నగర్ చెరువు వద్ద నిమజ్జనానికి 8 క్రేన్లు ఏర్పాటు చేస్తున్నామని సీపీ సుధీర్‌బాబు తెలిపారు. సోమవారం ఆయన అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు.