- గణపతి బప్పా..ఉంటామప్పా.. హైదరాబాద్‌లో సంబురంగా వినాయక నిమజ్జనం
- భక్తులతో కిక్కిరిసిన హుస్సేన్‌సాగర్ పరిసరాలు
- ఉదయం 6 గంటలకే మొదలైన ఖైరతాబాద్ బడా గణేశ్ శోభాయాత్ర
- మధ్యాహ్నం 1.30 గంటలకు గంగమ్మ ఒడికి గణనాథుడు
- వర్షంలోనూ కొనసాగిన వేడుకలు.. నేడు ఉదయం కూడా నిమజ్జనాలు
హైదరాబాద్, వెలుగు: గల్లీ గల్లీలో పిల్లాజెల్లల ఆటలు, పాటలు.. ‘గణపతిబప్పా మోరియా’ నినాదాలు..! తొమ్మిదిరోజులు మండపాల్లో కొలువై పూజలందుకున్న బొజ్జ గణపయ్యను గంగమ్మ ఒడికి తరలించేందుకు భారీ శోభాయాత్రలు! పాతబస్తీ, దిల్సుఖ్నగర్, సికింద్రాబాద్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు వినాయక విగ్రహాల క్యూ!! గురువారం హైదరాబాద్‌లో గణేశ్ ఊరేగింపులు, నిమజ్జనాలు సంబురంగా సాగాయి. దశ మహాగణపతిగా దర్శనమిచ్చిన ఖైరతాబాద్ బడా గణేశ్ నిమజ్జనం మధ్యాహ్నం వరకే పూర్తయింది.
అర్ధరాత్రే ఏర్పాట్లు పూర్తి
ఖైరతాబాద్ బడా గణేశ్ ఊరేగింపు, నిమజ్జనం కోసం బుధవారం అర్ధరాత్రే ఏర్పాట్లు చేశారు. రాత్రిపూటే వినాయకుడ్ని ప్రత్యేకంగా సిద్ధం చేసిన వాహనంపైకి చేర్చారు. ఆ తర్వాత కలశపూజ నిర్వహించి.. గురువారం ఉదయం 6 గంటలకు శోభాయాత్ర ప్రారంభించారు. తొమ్మిది రోజులపాటు బడా గణేశ్‌ను దర్శించుకునేందుకు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా జనం వచ్చారు. వీడ్కోలు పలికేందుకు కూడా పోటెత్తారు. డప్పు వాయిద్యాలు, నృత్యాలు చేస్తూ శోభాయాత్రలో ముందుకు సాగారు. ఉదయం 8 గంటల వరకు ఖైరతాబాద్ సెన్సేషన్ థియేటర్ సమీపానికి యాత్ర చేరుకుంది. 9 గంటల వరకు టెలిఫోన్‌భవన్ వద్దకు, 10 గంటలకు తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్దకు బడా గణేశ్ చేరుకున్నాడు. అక్కడి నుంచి మధ్యహ్నం పన్నెండున్నర గంటల ప్రాంతంలో ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నంబర్ 4 వరకు చేరుకున్నాడు.
అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి.. సరిగ్గా మధ్యాహ్నం 1.30 గంటల టైమ్‌లో మహా వినాయకుడిని హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేశారు. ఈ ఘట్టాన్ని చూసేందుకు తరలివచ్చిన భక్తులతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. ఖైరతాబాద్ వినాయకుడి తర్వాత అత్యంత ప్రాధాన్యం కలిగిన బాలాపూర్ గణేశ్ ఊరేగింపు కూడా ఈసారి కాస్త తొందరగానే ప్రారంభమైంది. ముందుగా బాలాపూర్ గ్రామ పరిధిలోని అన్ని వీధుల్లో గణనాథుడ్ని ఊరేగించారు. అనంతరం గ్రామంలోని బొడ్రాయి వద్ద లడ్డూ వేలం నిర్వహించారు. సాయంత్రం 4.30 గంటలకు బాలాపూర్ గణేశ్ నిమజ్జనం జరిగింది.
వేల సంఖ్యలో తరలివచ్చిన విగ్రహాలు
పాతబస్తీ, దిల్సుఖ్నగర్, సికింద్రాబాద్ వైపు నుంచి వేల సంఖ్యలో వినాయక విగ్రహాలు ట్యాంక్‌బండ్ వైపు తరలివచ్చాయి. గురువారమే మిలాద్ ఉన్ నబీ పండుగ కావడంతో మధ్యాహ్నం కొద్దిసేపు పాతబస్తీ ఏరియాలో పోలీసులు శోభాయాత్రలను నిలిపివేశారు. ముస్లింల ప్రార్థనల అనంతరం తిరిగి ప్రారంభించారు. చత్రినాక, షాలిబండ, లాల్ దర్వాజా, ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్ట తదితర ప్రాంతాల నుంచి చార్మినార్ మీదుగా హుస్సేన్‌సాగర్ వరకు శోభాయాత్రలు సాగాయి. నిమజ్జనాల కోసం అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. జీహెచ్ఎంసీ వివిధ ప్రాంతాల్లో తాత్కాలిక మరుగుదొడ్లు, మూత్రశాలలు ఏర్పాటు చేసింది. పలు చోట్ల హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేశారు. మెట్రో వాటర్ బోర్డు అధికారులు భక్తులకు వాటర్ ప్యాకెట్లను ఉచితంగా సరఫరా చేశారు. వివిధ స్వచ్ఛంద సంస్థలు భక్తులకు ఫుడ్ ప్యాకెట్లను సరఫరా చేశాయి. హుస్సేన్‌సాగర్‌లో గురువారం రాత్రంతా నిమజ్జనాలు కొనసాగాయి. శుక్రవారం ఉదయం కూడా ఉంటాయని అధికారులు తెలిపారు.
వర్షంలోనూ ఉత్సాహంగా
మధ్యాహ్నం ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం పూర్తయ్యే వరకు కొంతసేపు పోలీసులు ఊరేగింపులను నిలిపివేశారు. తర్వాత భారీ సంఖ్యలో వినాయక విగ్రహాలను ఊరేగింపుగా ట్యాంక్ బండ్ వైపు భక్తులు తీసుకువచ్చారు. సాయంత్రం నాలుగున్నర గంటలకు ట్యాంక్ బండ్ పరిసరాల్లో భారీ వర్షం కురిసింది. వర్షంలోనూ భక్తులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. రాత్రి 7గంటల వరకు కూడా నగరంలోని చాలా ప్రాంతాల నుంచి వినాయ కుల ఊరేగింపులు బయలు దేరలేదు. దీంతో శుక్రవారం ఉదయం 10 గంటల వరకూ నిమజ్జనాలు కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.