- రెండో రోజు రాత్రిదాకా నిమజ్జనాలు
- కాలనీల్లో అర్ధరాత్రి స్టార్ట్ కావడంతో నిమజ్జనం ఆలస్యం
- పోలీసులు పట్టించుకోక పోవడమూ కారణమే
- క్రేన్ల మొరాయింపు.. వాహనాల బ్రేక్‌డౌన్‌తో చిక్కులు
- డీజేలతో గంటలు రోడ్లపైనే..
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్లో ఈసారి గణేశ్నిమజ్జనం రెండు రోజుల పాటు కొనసాగింది. ఏటా 11వ రోజు నిమజ్జనాలు షురువైతే మరుసటి రోజు ఉదయం 11 గంటల్లోపు పూర్తయ్యేవి. ఈసారి రెండు రోజంతా కొనసాగాయి. దీంతో బుధవారం వర్కింగ్ డే కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గ్రేటర్‌పరిధిలోని కాలనీలు, గల్లీల్లోని విగ్రహాలు ఆలస్యంగా హుస్సేన్‌సాగర్ కు బయలుదేరడమే ఇందుకు ప్రధానకారణం. అలాగే పోలీసులు పట్టించుకోకపోవడం, క్రేన్ల మొరాయింపు, వాహనాలు నిలిచిపోవడం ఇతర కారణాలుగా తెలుస్తోంది.
అర్ధరాత్రయినా తీయలే
ఏటా వినాయకులను 11వ రోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం లోపు నిమజ్జనానికి తరలించేవారు. ఫలానా టైంలోపు నిమజ్జనం చేయాల్సిందేనని, లేకపోతే ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయని పోలీసులు హెచ్చరించి శోభాయాత్రలో కలిసేలా చేసేవారు. కానీ, ఈసారి పోలీసులు దానిపై పెద్దగా దృష్టి పెట్టినట్టు కనిపించలేదు. దీంతో రాత్రి 10 గంటల వరకు విగ్రహాలు మండపాల్లోనే ఉన్నాయి. తీరిగ్గా అర్ధరాత్రి తర్వాత బయలుదేరడంతో హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం మంగళవారమా.. లేక బుధవారమా అన్న భ్రాంతి కలిగింది.
డీజేలతో రోడ్లపైనే ..
వినాయక మండపాలతోపాటు శోభాయాత్రలో డీజేలు పెట్టడానికి పర్మిషన్లేదని పోలీసులు చాలా స్పష్టంగా చెప్పారు. కానీ, ఎక్కడా వారి ఆదేశాలను పాటించిన దాఖలాలు లేవు. దాదాపు 50 శాతానికి పైగా నిర్వాహకులు డీజేలు పెట్టి గంటలకు గంటలు డ్యాన్సులు వేస్తూ గడపడంతో చాలా వరకు వాహనాలు ఇన్‌టైంలో నిమజ్జనానికి ముందుకు వెళ్లలేకపోయాయి. సికింద్రాబాద్లాంటి కొన్ని ప్రాంతాల్లో అయితే అర్ధరాత్రి 12 గంటల వరకు.. మరికొన్ని చోట్ల ఒంటి గంట వరకు కాలనీల్లోనే ఉన్నాయి. అక్కడక్కడా పోలీసులు హెచ్చరించిన చోట మాత్రమే తరలివెళ్లాయి.
హుస్సేన్‌సాగర్‌పై పని చేయని నాలుగు క్రేన్లు
హుస్సేన్సాగర్తీరంలోని ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్మార్గ్, నెక్లెస్‌రోడ్‌లో మొత్తం 35 క్రేన్లు ఏర్పాటు చేశారు. సిబ్బంది కూడా మూడు షిఫ్టుల్లో పని చేశారు. అయితే మెషీన్లు నాన్‌స్టాప్‌గా పనిచేయడంతో బుధవారం తెల్లవారుజామున నాలుగు క్రేన్లు మొరాయించాయి. ఎన్టీఆర్‌మార్గ్‌లో ఒకటి, పీపుల్స్‌ప్లాజాలో రెండు, ట్యాంక్‌బండ్‌పై ఒక క్రేన్పని చేయలేదు. దీంతో నిమజ్జనాలు ఆలస్యమయ్యాయి. నిమజ్జనం తర్వాత ఇండ్లకు వెళ్లే వాహనాల్లో కొన్ని మొరాయించడంతో ట్రాఫిక్సమస్యలు తలెత్తాయి. దీంతో వెనక వస్తున్న విగ్రహాలు వెనకే ఉండిపోయి నిమజ్జనం ఆలస్యమైంది. ఖైరతాబాద్, బాలాపూర్ విగ్రహాల నిమజ్జనంపై ఫోకస్‌పెట్టిన పోలీసులు సాగర్ వద్ద విగ్రహాలను తరలించే విషయాన్ని పట్టించుకోకోపోవడం సమస్యకు
కారణమైంది.
మొత్తం 1,25,511 విగ్రహాల నిమజ్జనం
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్లో గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. మంగళవారం ఉదయం మొదలైన ప్రక్రియ బుధవారం రాత్రి ముగిసింది. హుస్సేన్ సాగర్, జీ డిమెట్ల ఫాక్స్ సాగర్, బహుదూర్ పురా మీరాలం చెరువు, సరూర్ నగర్ పెద్ద చెరువు, కాప్రా ఊర చెరువు, ఐడీఎల్చెరువు, 27 పర్మినెంట్ బేబీ పాండ్స్, 24 పోర్టబుల్ వాటర్ ట్యాంక్స్, 22 ఎస్కవేషన్ పాండ్స్ లో మొత్తం 1,25, 511 విగ్రహాలు నిమజ్జనమయ్యాయి. అత్యధికంగా కూకట్‌పల్లిలోని ఐడీఎల్చెరువులో 28, 946 విగ్రహాలను నిమజ్జనం చేశారు. తర్వాత హుస్సేన్‌సాగర్‌లో 21,267 విగ్రహాలను వేశారు. ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గ్‌లో 5,730, నెక్లెస్ రోడ్ లో 2,360, పీపుల్స్ ప్లాజా వద్ద 5,720, ట్యాంక్ బండ్ పై 7,457 విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరాయి. హుస్సేన్ సాగర్ లో బుధవారం 3,490 విగ్రహాలను, కూకట్పల్లి ఐడీఎల్ లేక్ లో 2,400 విగ్రహాలను గంగమ్మ ఒడికి చేర్చారు. ట్యాంక్ బండ్ పై మధ్యాహ్నం12 గంటల వరకు, ఎన్టీఆర్ మార్గ్ లో సాయంత్రం 5 గంటల వరకూ నిమజ్జనం కొనసాగింది. ఆ తర్వాత వచ్చిన విగ్రహాలను పీపుల్స్ ప్లాజా వైపు తరలించారు. అక్కడ ఎనిమిది క్రేన్లతో నిమజ్జనం పూర్తి చేశారు. అలాగే రాజేంద్రనగర్ పత్తికుంట చెరువులో 11,548, అల్వాల్ కొత్తచెరువులో 6,572, అల్వాల్ కొత్తచెరువు బేబీ పాండ్ లో 6,572, పల్లె చెరువులో 5,245, సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్ లో 3,290 విగ్రహాలను నిమజ్జనం చేశారు.
సమన్వయంతో సక్సెస్ చేశాం:జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి
పోలీస్, హెచ్ఎండీఏ, వాటర్ వర్క్స్, విద్యుత్, జీహెచ్ఎంసీ శాఖల సమన్వయంతో గణేశ్నిమజ్జనాలను సక్సెస్ చేశామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. వ్యర్థాలను తొలగించేందుకు 15 వేల మంది పనిచేశారన్నారు. పేపర్ కటింగ్స్తొలగించడంలో ఇబ్బందులు పడ్డామన్నారు. లేటెస్ట్ మెషీన్స్‌తో తొలగించాల్సి వచ్చిందని చెప్పారు. అన్ని ప్రాంతాల్లో శానిటేషన్‌పై దృష్టి సారించాలని జోనల్ కమిషనర్లకు సూచించారు. బల్దియా ఆఫీసర్లు, శానిటేషన్ కార్మికులు, సిబ్బంది రాత్రి పగలు తేడా లేకుండా పనిచేసి ఉత్సవాలను సక్సెస్ చేశారని, సహకరించిన ప్రతి ఒక్కరికి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి థ్యాంక్స్ చెప్పారు.
వాహనాల మొరాయింపే కారణం
వర్కింగ్ డే కావడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. నిమజ్జనాలకు తరలుతున్న వాహనాలు కొన్ని బ్రేక్ డౌన్ అయ్యాయి. దీంతో కొన్నిచోట్ల ట్రాఫిక్ జామ్అయ్యింది. లేకపోతే ఉదయం 7 గంటల వరకే నిమజ్జనం పూర్తయ్యేది. ఉదయం10.30 గంటలకు దాదాపు పూర్తి చేశాం. – సీవీ ఆనంద్, సీపీ, హైదరాబాద్