అన్ని మండపాలకు ఫ్రీ కరెంట్..​ నిమజ్జనం రోజు నిరంతరాయంగా మెట్రో, MMTS, ఆర్టీసీ సేవలు

ఖైరతాబాద్, వెలుగు: గణేశ్​ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాల ఏర్పాట్లు చేస్తోందని భాగ్యనగర్ గణేశ్​ఉత్సవ సమితి అధ్యక్షుడు జి.రాఘవరెడ్డి, కార్యదర్శి డాక్టర్​శశిధర్​తెలిపారు. సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో సోమవారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ఈ నెల 7న గణేశ్​ఉత్సవాలు ప్రారంభమవుతాయని చెప్పారు. మండపాల నిర్వాహకులు పోలీసులకు ఇన్ఫర్మేషన్​ఇస్తే చాలని, అనుమతి కోసం ఆన్​లైన్ లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఏర్పాట్లపై సీఎం రేవంత్​రెడ్డి ఇప్పటికే అన్ని విభాగాల అధికారులు, ఉత్సవ కమిటీలతో సమావేశం నిర్వహించారని చెప్పారు. 


గతేడాది సిటీలో 1.20 లక్షల విగ్రహాలు పెట్టారని, ఈసారి ఆ సంఖ్య 1.40 లక్షలకు చేరనుందన్నారు. ఉత్సవాల నిర్వహణకు స్పెషల్​బడ్జెట్​కేటాయించాలని సీఎంను కోరినట్లు తెలిపారు. భాగ్యనగర్​గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 44 సామూహిక నిమజ్ఞనాలు నిర్వహించామని, ఈసారి జరిగేది 45వ సామూహిక నిమజ్జనమని స్పష్టం చేశారు. హుస్సేన్​సాగర్​సహా మొత్తం 100 చోట్ల వినాయక నిమజ్ఞనాలు జరుగుతాయని వెల్లడించారు. 17న గణేశ్ శోభాయాత్ర సందర్భంగా మెట్రో, ఎంఎంటీఎస్​రైళ్లు, ఆర్టీసీ బస్సులు నిరంతరాయంగా నడుస్తాయని, భక్తులు వినియోగించుకోవాలని తెలిపారు.

 నిమజ్ఞనం సజావుగా సాగేందుకు 253 యాక్షన్ టీమ్స్, 10,500 శానిటేషన్ వర్కర్లు, 2 వేల మంది స్వీపింగ్ స్టాఫ్, 30 స్వీపింగ్ మెషీన్లు, 100 మినీ టిప్పర్లు, 20 జేసీబీలు, 200 మొబైల్ టాయిలెట్లు, గజఈతగాళ్లు, బోట్లు, డీఆర్ఎఫ్ టీమ్స్ ఉంటాయని వెల్లడించారు. అన్ని ఆర్టీఏ ఆఫీసుల పరిధిలో 16న వాహనాలు అందుబాటులో ఉంటాయన్నారు. సమావేశంలో ఉత్సవ సమితి సెక్రటరీ మహేందర్, సలహాదారు కిరోడిమల్​పాల్గొన్నారు.