32 వేల గణేశ్​మండపాలకు జియో ట్యాగింగ్

32 వేల గణేశ్​మండపాలకు జియో ట్యాగింగ్
  •     5 ఫీట్లు అంతకంటే ఎక్కువ ఎత్తున్న విగ్రహాలకు ట్యాగ్
  •     క్యూ ఆర్​కోడ్ స్కాన్​ చేస్తే ఫుల్​డీటెయిల్స్​ కనిపిస్తయ్​
  •     ప్రతి మండపం వద్ద ఇద్దరు కానిస్టేబుల్స్​తో  బందోబస్తు

హైదరాబాద్ సిటీ, వెలుగు : గ్రేటర్​లో 32 వేల మండపాల్లో వినాయకులు కొలువుదీరనున్నారు. అన్నింటికి పోలీసులు జియో ట్యాగింగ్ చేస్తున్నారు. గత నెల 25వ తేదీ నుంచి శుక్రవారం వరకు మండపాల ఏర్పాటుకు సంబంధించి ఆన్‌లైన్‌ అప్లికేషన్స్ తీసుకున్న పోలీసులు 5 ఫీట్లు అంతకంటే ఎక్కువ ఎత్తున్న విగ్రహాల రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేశారు. 

www. hyderabadpolice.gov.in, www .policeportal.tspolice.gov.in  ద్వారా దరఖాస్తు చేసుకున్న 32 వేల మండపాలకు క్యూఆర్ కోడ్ ఫిక్స్​చేస్తున్నారు. జియో ట్యాగింగ్‌ ద్వారా ప్రతీ మండపాన్ని పోలీస్ యాప్స్‌తో కనెక్ట్ చేస్తున్నారు. అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇతర ప్లేసుల్లో ఏర్పాటు చేసిన మండపాలకు షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేశారు.

23 వేలకు పైగా పూర్తి

హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 32,530కు పైగా గణపతి మండపాల రిజిస్ట్రేషన్ జరగ్గా ఇప్పటికే 23 వేలకు పైగా మండపాల్లో జియో ట్యాగింగ్​పూర్తి చేశారు. జియో ట్యాగింగ్​ కాని మండపాల్లో యుద్ధప్రాతిపదికన కంప్లీట్​చేయాలని చూస్తున్నారు. జియో ట్యాగింగ్​పూర్తయిన మండపాలకు స్థానిక పోలీసులు వెళ్లి పోలీస్ కాప్ యాప్‌లో కనెక్ట్  చేస్తున్నారు. అక్కడున్న క్యూ ఆర్​కోడ్​స్కాన్​చేస్తే నిర్వాహకుల పేర్లు, ఫోన్ నంబర్లు, స్థానిక లైజన్ ఆఫీసర్ల వివరాలు పోలీసులకు కనిపిస్తాయి.

అలాగే మండపాల వద్ద ఎలాంటి సమస్య తలెత్తినా నిమిషాల వ్యవధిలో చేరుకునే విధంగా ప్రణాళికలు రూపొందించారు. ఒక్కో మండపం వద్ద పరిస్థితిని స్థానిక డీసీపీలు, ఏసీపీలతోపాటు స్థానిక లైజన్ ఆఫీసర్, ఇన్​స్పెక్టర్, ఎస్సై స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు కో ఆర్డినేట్ చేస్తూ ఉంటారు. దీనిపై స్థానిక బ్లూ కోల్ట్స్, పెట్రోలింగ్ సిబ్బంది వద్ద  పూర్తి సమాచారం ఉంటుంది.  

రోజు తప్పించి రోజు నిమజ్జనం  

3, 5, 7, 9, 11 రోజుల్లో నిమజ్జనానికి వెళ్లే విగ్రహాల వివరాలను పోలీస్ యాప్స్ లో పొందుపరిచారు. నిర్వాహకులతో సంబంధిత లైజన్ ఆఫీసర్ కోర్డినేట్ చేసుకుంటూ నిర్ధారించిన టైంలో నిమజ్జనానికి వెళ్లేలా చర్యలు తీసుకుంటారు. రిజిస్ట్రేషన్ చేసుకున్నవే కాకుండా గ్రేటర్‌‌ వ్యాప్తంగా లక్షన్నర మండపాలను నెలకొల్పే అవకాశాలు ఉన్నట్లు భాగ్యనగర్ గణేశ్​ఉత్సవ సమితి ఇప్పటికే ప్రకటించింది.