ఆదిలాబాద్ జిల్లాలో బ్యాంకు దోపిడీకి యత్నించిన ముఠా అరెస్ట్

ఆదిలాబాద్ జిల్లాలో బ్యాంకు దోపిడీకి యత్నించిన ముఠా అరెస్ట్
  • 9 మందిపై కేసు.. అదుపులో ముగ్గురు
  • ఇప్పటికే ముగ్గురు నిందితులు జైల్లో..

ఆదిలాబాద్ ​టౌన్, వెలుగు: తెలంగాణ గ్రామీణ బ్యాంకులో గతేడాది దోపిడీకి యత్నించిన దుండుగులను అరెస్టు చేసినట్లు ఎస్పీ అఖిల్​మహాజన్ ​తెలిపారు. శనివారం పోలీస్​ హెడ్​క్వార్టర్స్​లో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పట్టణంలోని పలు కాలనీలకు చెందిన యువకులు జల్సాలకు అలవాటు పడి ఓ ముఠాగా ఏర్పడి నేరాలకు పాల్పడుతున్నారు. గతేడాది డిసెంబర్​12న ఆదిలాబాద్ రూరల్​ మండలం రామాయిలో తెలంగాణ గ్రామీణ బ్యాంకులో దోపిడీకి ప్లాన్​ వేశారు.

అర్ధరాత్రి అక్కడికి చేరుకొని బ్యాంకు గోడను పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. అయితే బ్యాకులోని సీసీ కెమెరాలు హ్యూమన్​ డిటెక్ట్​ సాఫ్ట్​వేర్​ దుండగులను గుర్తించి అలారం మోగడంతో పరారయ్యారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం కచికంటి శివారులో అనుమానస్పదంగా తిరుగుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించారు.

పట్టుబడిన వారిలో భుక్తాపూర్​కు చెందిన దగడ్ సాయి అలియాస్​ సెంబేటి సాయికుమార్, కేఆర్​కే కాలనీకి చెందిన అశోక్ అలియాస్​ఆశ, మినుగు రాజేశ్వర్ అలియాస్​ రాజేశ్​ ఉన్నారు. వారి వద్ద నుంచి దొంగతనానికి ఉపయోగించిన గ్యాస్ సిలిండర్, గ్యాస్ కట్టర్, గడ్డపారలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పుష్ప అలియాస్​పవన్, మణికంఠ, జాదవ్ రాజు పరారీలో ఉండగా దొంగతనం ప్లాన్ ​వేసిన చవాన్ రవి, సన్నీ అలియాస్​సుఖ్​దేవ్ సన్నీ, గోవిందుడు కార్తీక్ అలియాస్ ​గోల్డెన్ కార్తీక్ ఇతర కేసుల్లో ప్రస్తుతం జైల్లో ఉన్నట్లు వెల్లడించారు.  వీరంతా ఆదిలాబాద్​తో పాటు ఇతర జిల్లాల్లో గతంలో చోరీలతో పాటు ఇతర కేసుల్లో జైలుకు వెళ్లివచ్చారన్నారు. సమావేశంలో డీఎస్పీ జీవన్​రెడ్డి, సీసీఎస్​ సీఐ చంద్రశేఖర్, రూరల్ సీఐ ఫణిధర్, ఎస్సై ముజాహిద్, సిబ్బంది పాల్గొన్నారు.