
ఒకవైపు లింగ నిర్ధారణ పరీక్షలు చేయొద్దని ప్రభుత్వం చట్టం చేసి ఎన్ని ఆంక్షలు విధించినా కొన్ని ఆస్పత్రులు లోగుట్టుగా పరీక్షలు చేయడం అక్కడక్కడా చూస్తూనే ఉన్నాం. ఆ స్పత్రులకు ఫైన్ వేయడం, మరీ మితిమీరితే సీజ్ చేయడం జరుగుతూనే ఉంది. అయినా కొందరి బుద్ధి మారడం లేదు. ఆస్పత్రిలో అయితే తెలిసిపోతుందనీ.. రూట్ మార్చారు. కారునే ల్యాబ్ గా మార్చుకున్నారు కేటుగాళ్లు. జెండర్ టెస్టులు చేస్తూ రహస్యంగా ఆపరేషన్ చేయిస్తూ అడ్డదారిలో సంపాదనకు మరిగారు. తాజాగా ఖమ్మం జిల్లాలో ఇలాంటి చట్టవిరుద్ధమైన పని చేస్తున్న ముఠాను అరెస్టు చేశారు పోలీసులు.
వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా అల్లిపురానికి చెందిన కాత్యాయని గతంలో ఖమ్మంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా పని చేసేది. బల్లేపల్లికి చెందిన ఆర్.ఎం.పి చారి, కుదుమూరుకు చెందిన ఆర్ఎంపి రాచబండి మనోజ్ తో పరిచయం ఏర్పడింది. అక్రమ సంపాదన కోసం ఒక ముఠాగా ఏర్పడి కారు కొనుగోలు చేశారు. అందులో అల్ట్రా సౌండ్ స్కాన్, ఇతర సామాగ్రిని అమర్చారు.
ఇల్లందు, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం చుట్టుపక్కల ప్రాంతాలలోని గ్రామాలకు వెళుతూ గర్భంతో ఉన్న మహిళలకు మాయ మాటలు చెప్పి కారులోనే లింగ నిర్ధారణ పరీక్షలు చేసి ఆడ, మగ అని చేప్పేవారు. ఈ పరీక్షకు రూ.5 నుంచి 10వేల రూపాయల వరకు వసూలు చేసేవారు. గర్భం ఇష్టంలేని మహిళల్ని అబార్షన్ కొరకు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి రహస్యంగా పంపి అబార్షన్ చేయించేవారు. దీనికోసం వేల రూపాయలు వసూలు చేస్తూ దందా జోరుగా కొనసాగిస్తున్నారు.
ఈ అక్రమ దందా ముఠా గురించి సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు నిఘా పెట్టి పట్టుకున్నారు. ముఠాలోని ఇద్దరిని అరెస్టు చేయగా, ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్ట రీత్యా నేరం. పుట్టబోయేది ఆడ అయినా మగ అయినా ఈ రోజుల్లో పెద్ద తేడా ఏమీ ఉండదు. కొన్ని సార్లు వయసు మళ్లిన తల్లిదండ్రులను ఆడపిల్లలే చివరికి పోషిస్తున్నారు. ఆడ, మగ అనే తేడా లేకుండా సమానం అనే భావన కలిగి ఉండాలని పోలీసులు, అధికారులు సూచిస్తున్నారు.