సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు పంపుతున్నగ్యాంగ్

సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు పంపుతున్నగ్యాంగ్
  • సైబర్ నేరగాళ్లకు అకౌంట్ వివరాలు పంపుతున్న గ్యాంగ్‌‌
  •     ఒక్కో అకౌంట్‌‌కి రూ.15 వేలు కమీషన్
  •     82 ఖాతాల్లో రూ.5 కోట్ల లావాదేవీలు
  •     65 అకౌంట్లు స్వాధీనం, ఐదుగురు అరెస్టు

హైదరాబాద్‌‌, వెలుగు :  సైబర్ నేరగాళ్లకు బ్యాంక్  అకౌంట్స్‌‌ సప్లయ్  చేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను ఈస్ట్‌‌జోన్‌‌ టాస్క్‌‌ఫోర్స్‌‌, హైదరాబాద్  సిటీ సైబర్ క్రైం పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద 65 బ్యాంకు ఖాతాల కిట్స్, 14 డెబిట్  కార్డులు, 31 సిమ్ కార్డులు, 6 సెల్‌‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్యాంగ్  సప్లయ్ చేసిన 82 ఖాతాల్లో సైబర్  నేరగాళ్లు రూ.5 కోట్ల లావాదేవీలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. టాస్క్‌‌ఫోర్స్ డీసీపీ రష్మి షర్మిల తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరాఖండ్‌‌కు చెందిన ఆరిఫ్  షఫీ 2009లో సౌదీకి వెళ్లాడు. గత ఏడాది ఫిబ్రవరిలో షార్జాలో ఉత్తరప్రదేశ్ కు చెందిన జాయిద్‌‌, పంజాబ్‌‌కు చెందిన సందీప్‌‌  సింగ్‌‌ తో అతనికి పరిచయం ఏర్పడింది. వారు క్రిప్టో కరెన్సీ బిజినెస్  చేస్తున్నట్లు షఫీకి చెప్పారు. డబ్బు లావాదేవీల కోసం ఇండియన్  బ్యాంక్  అకౌంట్స్ కావాలని కోరారు. ఇందుకోసం ఒక్కో అకౌంట్‌‌కు రూ.15 వేలు ఇస్తామని చెప్పారు. దీంతో షార్జాలో నివాసం ఉంటున్న హైదరాబాద్  చాదర్‌‌‌‌ఘట్‌‌కు చెందిన ఫాతిమా బేగంను ఆరిఫ్‌‌  షఫీ కలిశాడు. బ్యాంక్  అకౌంట్స్‌‌, సిమ్  కార్డులు సేకరించాలని ఆమెను షఫీ కోరాడు.

 ఫాతిమా బేగం హైదరాబాద్‌‌లోని తమ బంధువులకు సమాచారం అందించింది. సిమ్ కార్డులు, బ్యాంకు ఖాతాలు ఇస్తే ఒక్కో అకౌంట్‌‌కి రూ.10 వేలు ఇస్తామని చెప్పింది. దీంతో డబిర్‌‌‌‌పురకు చెందిన మహ్మద్‌‌  అబ్దుల్‌‌  నవీద్‌‌ (30), సోహైల్‌‌ ఖాన్‌‌ (20), కాలడూరకు చెందిన మహ్మద్‌‌ దడే ఖాన్ (21), చాంద్రయణగుట్ట ఫూల్‌‌బాగ్‌‌కు చెందిన సోహైల్‌‌ ఖాన్‌‌ (25)  దాదాపు 82 బ్యాంకు ఖాతాలు, సిమ్‌‌ కార్డులను సేకరించారు. ఈ అకౌంట్స్‌‌, ఫోన్‌‌  నంబర్లు ఫాతిమా బేగం ద్వారా ఆరిఫ్‌‌  షఫీకి, అక్కడి నుంచి దుబాయ్‌‌లోని సైబర్ నేరగాళ్లకు చేరాయి. ఇలా సేకరించిన అకౌంట్స్‌‌తో సైబర్‌‌ ‌‌నేరగాళ్లు మోసాలకు పాల్పడ్డారు. క్రిప్టో కరెన్సీతో పాటు ఆన్‌‌లైన్  ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ ఫ్రాడ్స్‌‌, గేమింగ్‌‌, బెట్టింగ్ సహా ఇతర సైబర్  నేరాలతో దాదాపు రూ.5 కోట్లు కొట్టేశారు. వాటికి సంబంధించి రాష్ట్రంలో 9, దేశవ్యాప్తంగా 125 కేసులు నమోదయ్యాయి.