సికింద్రాబాద్, వెలుగు: బీఎస్ఎన్ఎల్ అండర్‌గ్రౌండ్ కేబుళ్లను దొంగిలిస్తున్న నలుగురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.3.5 లక్షల విలువైన 350 కిలోల కాపర్ వైరును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను బేగంపేట డివిజన్ ఏసీపీ గోపాల కృష్ణమూర్తి, సీఐ చిర్రా రామయ్యతో కలిసి బుధవారం వెల్లడించారు. ఈస్ట్ గోదావరికి చెందిన వేముల సింహాద్రి(28), సింహాద్రి(38), గుంజ దుర్గ ప్రసాద్(21), వేముల ఆనంద్(21) సిటీలో బీఎస్ఎన్ఎల్అండర్ గ్రౌండ్ కేబుల్‌పనులు చేస్తున్నారు.
సులువుగా డబ్బులు సంపాదించాలని, రాత్రి సమయాల్లో రిపేర్ల కోసం వచ్చినట్టు వచ్చి, కేబుళ్లను కత్తిరించి తీసుకెళ్తున్నారు. వీటి నుంచి కాపర్‌వైరును వెలికితీసి, మహబూబాబాద్‌కు చెందిన తోట రామారావుకు అమ్ముతున్నారు. అయితే, ల్యాండ్ లైన్ ఫోన్లు, ఇంటర్నెట్సదుపాయాలు సరిగా రావడం లేదని కస్టమర్ల నుంచి ఫిర్యాదులు రావడంతో బీఎస్ఎన్ఎల్ అధికారులు లోపాలను గుర్తించేందుకు ప్రయత్నాలు చేపట్టారు. ప్యారాడైజ్ప్రాంతంలో వైరు కట్‌చేసినట్లు గుర్తించి, బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు బుధవారం బొలెరో వాహనంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.