- బ్యాంకు ఖాతాలు సప్లయ్ చేస్తున్న 10 మంది అరెస్ట్
- దుబాయ్ కేంద్రంగా ట్రేడింగ్ మోసాలు
- దేశవ్యాప్తంగా 770 కేసులు, కోట్లలో లూటీ
- రూ.4.55 కోట్లను ఫ్రీజ్ చేసిన పోలీసులు
హైదరాబాద్, వెలుగు: ఆన్‌లైన్ ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో సైబర్ నేరాలకు పాల్పడుతున్న మూడు దొంగల ముఠాల గుట్టు రట్టయింది. సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ అకౌంట్లను సప్లయ్ చేస్తున్న హైదరాబాద్, రాజస్థాన్, ఢిల్లీకి చెందిన10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.4.55 కోట్లు ఫ్రీజ్ చేశారు. డెబిట్ కార్డులు, పాస్ బుక్స్, సెల్‌ఫోన్లను సీజ్ చేశారు. మూడు గ్యాంగులపై దేశవ్యాప్తంగా 770 కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల వివరాలను హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి సోమవారం మీడియాకు వెల్లడించారు.
ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్‌లో ప్రధాన నిందితుడు బెర్లిన్ దుబాయ్ కేంద్రంగా సైబర్ మోసాలకు పాల్పడుతున్నాడు. స్టాక్ మార్కెట్ పై టిప్స్ చెప్తానని స్టాక్ బ్రోకర్‌గా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నాడు. అతన్ని ఫాలో అయినవారి నుంచి అందినంత దోచుకున్నాడు. ముందుగా తక్కువ మొత్తంలో లాభాలు చూపించి తర్వాత ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టించేవాడు. ఇలా హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి వద్ద రూ.1.3 కోట్లు వసూలు చేశాడు. మోసపోయానని ఆలస్యంగా గుర్తించిన బాధితుడు.. సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి బ్యాంక్ అకౌంట్ల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు.
రాజస్థాన్ గ్యాంగ్
రాజస్థాన్ లోని జోధ్‌పూర్‌కు చెందిన భురరామ్ అలియాస్ రాజూ భాయ్ దుబాయ్‌లో నివాసం ఉంటున్నాడు. అక్కడే నివాసం ఉండే మరో సైబర్ నేరగాడు బెర్లిన్‌తో కలిసి అతను ఆన్‌లైన్ మోసాలకు ప్లాన్ చేశాడు. ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్‌లో కొట్టేసిన డబ్బు డిపాజిట్ల కోసం జోధ్‌పూర్‌కు చెందిన మరో నిందితుడు రామ్‌చంద్ర అలియాస్ గణేశ్ రామ్‌తో కలిసి బ్యాంకు ఖాతాలు సేకరించేవాడు. వాటిని బెర్లిన్‌కు సప్లయ్ చేసేవారు. ఆన్‌లైన్ బ్యాంకింగ్ ఐడీ, ఎస్‌ఎమ్‌ఎస్ కోసం ఫోన్ నంబర్లు, కేవైసీ అందించేవారు.
ఇందుకు 20 శాతం కమీషన్ తీసుకునేవారు. ఇలా 47 అకౌంట్లను బెర్లిన్‌కు సప్లయ్ చేశారు. ఆన్‌లైన్ లో కొట్టేసే డబ్బును ఆ అకౌంట్లలో డిపాజిట్ చేసి ట్రాన్స్‌ఫర్స్ చేసుకునేవారు. ఇలా ట్రేడింగ్ పేరుతో దేశవ్యాప్తంగా మోసాలు చేశారు. ఈ గ్యాంగ్‌పై రాష్ట్రంలో 67 కేసులు నమోదుకాగా దేశవ్యాప్తంగా మొత్తం 770 కేసులు రిజిస్టర్ అయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ లోని మూడు కమిషనరేట్ల పరిధిలో మొత్తం రూ.2.98 కోట్లు కొట్టేశారు. వాటిలో రూ.1.44 కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు. రూ.55 లక్షలు బాధితులకు అందించారు. భురరామ్‌పై ఇప్పటికే లుక్ ఔట్ నోటీసు జారీ చేశారు.
పోలీసులకు చిక్కకుండా నేపాల్ బోర్డర్ మీదుగా భురరామ్ ఇండియా, దుబాయ్‌కి ప్రయాణం సాగించేవాడు. ఈ క్రమంలోనే గత నెలలో ఉత్తర్ ప్రదేశ్ లో సోనాలి వద్ద ల్యాండ్ ఇమిగ్రేషన్ అధికారులకు చిక్కాడు. భురరామ్, రామ్‌చంద్రను సిటీ సైబర్ క్రైం పోలీసులు అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తరలించారు. ప్రధాన నిందితుడు బెర్లిన్ దుబాయ్‌లో ఉన్నాడు. అతనిపైనా లుక్ ఔట్ నోటీసు జారీ చేశారు.
మరో రెండు కేసుల్లో 8 మంది అరెస్ట్
ట్రేడింగ్ పేరుతో హైదరాబాద్ కి చెందిన వ్యక్తి నుంచి రూ.కోటి 8 లక్షలు మోసం చేసిన కేసులో రాజస్థాన్‌కు చెందిన కృష్ణ ధాఖ, మనోజ్ కుమార్, ఢిల్లీకి చెందిన ఐడీఎఫ్‌సీ బ్యాంకు మాజీ ఉద్యోగి అషుతోష్ రాజ్, చార్టెడ్ అకౌంటెండ్ మునీష్ బన్సల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ఫేక్ బ్యాంక్ అకౌంట్లు క్రియేట్ చేసి సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.
ఆదిత్య స్టాక్ షేరింగ్ విప్ పేరుతో దుబాయ్ గ్యాంగ్ చేస్తున్న మోసాలకు బ్యాంక్ అకౌంట్లను సప్లయ్ చేస్తున్నట్లు ఆధారాలు సేకరించారు.ఈ గ్యాంగ్ పై దేశవ్యాప్తంగా 171 కేసులు నమోదు కాగా రాష్ట్రంలో 11 కేసులు రిజిస్టర్ అయ్యాయి. నిందితుల అకౌంట్ల నుంచి రూ.1.43 కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు. మరో కేసులో హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న రాజస్థాన్‌కు చెందిన మంగీలాల్ గోదర, భజన్ గోదర, కమలేష్ కుమార్, ప్రకాశ్ చంద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ గ్యాంగ్‌పై దేశవ్యాప్తంగా 92 కేసులు నమోదు కాగా రాష్ట్రంలో 10 కేసులు రిజిస్టర్ అయ్యాయి. వారి అకౌంట్లలో రూ.1.68 కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు.