సూర్యాపేట జిల్లాలో ఐదుగురు దొంగల ముఠా అరెస్ట్

సూర్యాపేట జిల్లాలో ఐదుగురు దొంగల ముఠా అరెస్ట్
  • రూ.6.38 లక్షల బంగారం, 
  • వెండి, నగదు స్వాధీనం 

సూర్యాపేట, వెలుగు : డెకాయిట్ దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ వివరాలు వెల్లడించారు. మేళ్లచెరువు శివారు వెల్లటూరు గ్రామంలో ఈనెల19న తెల్లవారుజామున 3 గంటల సమయంలో వ్యాపారి తమ్మిశెట్టి వెంకయ్య ఇంట్లోకి ఐదుగురు దొంగలు చొరబడ్డారు. ఆయుధాలతో వెంకయ్యతోపాటు ఆయన ఇద్దరు కూతుర్లను బెదిరించి బంగారం, వెండి ఆభరణాలు, రూ.50 వేల నగదు ఎత్తుకెళ్లారు. 

బాధితుడి ఫిర్యాదు మేరకు మేళ్లచెరువు ఎస్ఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కోదాడ రూరల్ సీఐ రజిత రెడ్డి, తన సిబ్బందితో అనంతగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఖమ్మం వెళ్లే జాతీయ రహదారిపై శాంతినగర్ వద్ద మంగళవారం వాహనాల తనిఖీ చేపట్టారు. అనుమానంగా వస్తున్న ఇన్నోవా కారును గుర్తించి తనిఖీ చేశారు. అందులో ఉన్న ఐదుగురిని అదుపులోకి విచారించడంతో అసలు విషయం బయటపడింది. 

వారి వద్ద నుంచి 6.5 తులాల బంగారం, 30 తులాల వెండి, ఇన్నోవా కారు, 5 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లాకు చెందిన వేమవరపు నాగరాజు, వేమవరపు పుల్లారావు,  భిక్షలు, నల్గొండ జిల్లాకు చెందిన రమావత్ మాత్రు, నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన చిక్కల ఆంజనేయులను అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు. వీరిపై గతంలో పలు స్టేషన్లలో కేసులు నమోదైనట్లు ఎస్పీ తెలిపారు.