హైదరాబాద్, వెలుగు: రాజస్థాన్ నుంచి హైదరాబాద్‌కి హెరాయిన్ సప్లయ్ చేస్తున్న నలుగురు సభ్యుల గ్యాంగ్ ను రాచకొండ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. రూ.కోటి విలువైన హెరాయిన్, ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ సీపీ సుధీర్‌బాబు శుక్రవారం వివరాలు వెల్లడించారు. రాజస్థాన్‌కు చెందిన నరేంద్ర బిష్ణోయ్ (20), ప్రవీణ్ బిష్ణోయ్ (23), హేమరామ్ (18) మీర్‌పేటలోని ప్రశాంతి హిల్స్ లో ఉంటున్నారు. వారంతా స్టీల్ రెయిలింగ్ వర్క్ చేస్తున్నారు. మీర్ పేటలోనే ఉండే రాజస్థాన్ కు చెందిన వ్యాపారి పక్కరమ్ దేవసి(31) హార్డ్ వేర్ షాప్ నడుపుతున్నాడు. ఆ నలుగురు డ్రగ్స్ కు అలవాటు పడ్డారు. రాజస్థాన్ లో తక్కువ రేటుకు దొరికే డ్రగ్స్ కొని సిటీలో సప్లయ్ చేయడం మొదలుపెట్టారు. రాజస్థాన్‌లోని పెడ్లర్ల వద్ద గ్రామ్ హెరాయిన్ రూ.5 వేలకు, ఎండీఎంఏ రూ.4 వేలకు కొని ఎల్బీ నగర్, మీర్‌పేట పరిసర
ప్రాంతాల్లోని కస్టమర్లకు
రూ.10 వేల నుంచి రూ.12 వేలకు విక్రయించేవారు. ఆర్డర్లపై ర్యాపిడో బైక్ సర్వీసెస్‌తో కస్టమర్లకు డెలివరీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం మధ్యాహ్నం అల్మాస్‌గూడలోని వర్షిణి ఫంక్షన్ హాల్ సమీపంలో కస్టమర్ల కోసం ఎదురు చూశారు. సమాచారం అందుకున్న ఎల్బీ నగర్ ఎస్‌వోటీ, మీర్‌పేట్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. నరేంద్ర, ప్రవీణ్, హేమరామ్, పక్కరామ్‌లను అరెస్ట్ చేశారు. వీరి వద్ద 150.3 గ్రాముల హెరాయిన్, 32.1 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు.