
- 5 మంగళ సూత్రాలు, ఆటో స్వాధీనం
పాపన్నపేట, వెలుగు: మహిళల మెడలో నుంచి మంగళసూత్రాలు ఎత్తుకెళ్తున్న ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. మంగళవారం పాపన్నపేట పీఎస్‌లో వివరాలు వెల్లడించారు. ఈనెల 3న రాత్రి పూట ఏడుపాయల దేవస్థానం పరిసరాలలో పాపన్నపేట పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా ఓ ఆటోలో అనుమానాస్పదంగా కూర్చున్న కొందరు వ్యక్తులను గమనించారు.
నిందితులు పారిపోవడానికి యత్నించగా వెంటనే పోలీసులు వెంబడించి అదుపులోకి తీసుకుని విచారించారు. నేరం అంగీకరించిన నిందితులు ఏడుపాయల దేవస్థానం పరిసరాలలో భక్తులు నిద్రిస్తున్న సమయంలో సత్రాలలోకి వెళ్లి బంగారు నగలు, మంగళసూత్రాలు దొంగిలించామని తెలిపారు. వీరి నుంచి 121 గ్రాములున్న ఐదు బంగారు మంగళ సూత్రాలను, చోరీలో ఉపయోగించిన ఆటోను స్వాధీనం చేసుకున్నారు.
నిందితులు సంగారెడ్డి రూరల్, హత్నూర, కౌడిపల్లి, కొల్చారం, శంకరంపేట్, అల్లాదుర్గం, కొండాపూర్, పుల్కల్ తో పాటు వివిధ పీఎస్‌లలో వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్నారని ఎస్పీ తెలిపారు. కేసును విజయవంతంగా ఛేదించిన పోలీసులను అభినందించారు