మాట్లాడాలని పిలిచి గ్యాంగ్ రేప్, మర్డర్

కొల్లూరు ఘటనలో ముగ్గురి అరెస్టు

గచ్చిబౌలి, వెలుగు: కొల్లూరులో మహిళ అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. గ్యాంగ్​రేప్​చేసి ఆమెను మర్డర్​చేసినట్లు నిర్ధారించారు. కేసు వివరాలను మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు శుక్రవారం గచ్చిబౌలిలోని తన ఆఫీస్​లో వెల్లడించారు. కొల్లూరులోని భోజ్య తండాకు చెందిన మహిళ(30) వారం క్రితం తన ఇద్దరు పిల్లలతో కలిసి మియాపూర్ న్యూ కాలనీలో ఉంటున్న తల్లి దగ్గరికి వచ్చింది. అదే గ్రామానికి చెందిన సెక్యూరిటీ గార్డు వి.మధునాయక్​(24), ఎస్.ఆనందం (27),  ప్రైవేట్ ఉద్యోగి టి.కుటుంబరెడ్డి (28) ముగ్గురు కలిసి ఈ నెల 3న కుటుంబరెడ్డి కారులో అమీర్​పేట్​లో ఓ కంపెనీ మీటింగ్​కు వెళ్లారు. మీటింగ్ తర్వాత మద్యం తాగిన ముగ్గురు తిరిగి కొల్లూరుకు బయలుదేరారు. ఇంటికి వెళ్తున్న క్రమంలో మంగళవారం రాత్రి 9.30 గంటలకు మధునాయక్ మియాపూర్​లో తల్లి ఇంట్లో ఉన్న మహిళకు ఫోన్ చేశాడు. మాట్లాడాలని చెప్పి మియాపూర్ మెయిన్ రోడ్డు దగ్గరికి రావాలని చెప్పాడు. అక్కడికి వచ్చిన ఆమె.. కారులో ముగ్గురిని చూసి భయంతో పారిపోయేందుకు ప్రయత్నించింది. కానీ నిందితులు ఆమెను బలవంతంగా కారులో ఎక్కించుకొని కొల్లూరు గ్రామ శివారులోని ఓ షెడ్డులోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఈ క్రమంలో తలకు బలమైన గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. కూతురు కనిపించడం లేదని తల్లి ఈ నెల 4న ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు పెట్టి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో భోజ్య తండాకు చెందిన కౌన్సిలర్​రామ్ సింగ్ అదేరోజు సాయంత్రం 3గంటలకు పోలీసులకు ఫోన్ చేసి.. షెడ్డులో డెడ్ బాడీ ఉన్నట్లు సమాచారం అందించాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను గుర్తించి ఈ నెల 5న అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. వారి వద్ద స్విఫ్ట్ కారు, నాలుగు సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

For More News..

రైతులు పొలాలకు పోలేకపోతున్నరు.. రోడ్లెయ్యండి